Maha Kumbh Mela 2025 Latest Advisory Ahead Of Mauni Amavasya: ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) ఘనంగా సాగుతోంది. బుధవారం మౌనీ అమావాస్య సందర్భంగా చేసే నదీ స్నానం విశేషమైంది. అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇప్పటికే దాదాపు 15 కోట్ల మంది త్రివేణి సంగమానికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మౌని అమావాస్య రోజున సుమారు 10 కోట్ల మంది పుణ్యస్నానాల కోసం రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం.. భక్తులకు తాజా అడ్వైజరీ జారీ చేశారు. భద్రతా నియమాలు పాటిస్తూ.. అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భక్తులకు సూచనలివే..
- నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలి. స్నానాల తర్వాత అక్కడ ఎక్కువ సేపు ఉండొద్దు. పార్కింగ్ ప్రదేశాలు లేదా బస చేసే ప్రాంతాలకు భక్తులు తిరిగి చేరుకోవాలి.
- బారికేడ్లు వద్ద, పాంటూన్ బ్రిడ్జిలపై నిదానంగా వెళ్లాలి. తొందరపాటు చర్యలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
- ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్ ఆస్పత్రులకు వెళ్లాలి. సంగమం వద్ద ఉన్న అన్ని ఘాట్లు పవిత్రమైనవే. తొలుత ఎక్కడికి చేరుకుంటే అక్కడే స్నానాలు చేయడం మంచిది.
- సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దు. సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దు.
- అనుక్షణ అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చోట పోలీసులు, అధికారులు సాయం తీసుకోవాలి. భక్తుల రద్దీ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ.. పోలీసులకు సహకరించాలి.
- సాధారణ, ట్రాఫిక్ పోలీసులతో పాటు ఏదైనా అత్యవసర కేసుల్లో సాయం అందించేందుకు వైద్య నిపుణుల బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అధికారుల సూచనలు కచ్చితంగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
నెట్ వర్క్ చింతే లేదు..
అటు, కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నా ప్రజలకు ఎలాంటి అంతరాయ లేకుండా కాల్స్‌కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా.. మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. ఈ మేరకు స్థానిక యంత్రాంగంతో కలిసి టెలికాం కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఈ ప్రాంతంలో దాదాపు అన్ని టెలికాం సంస్థలు ఈ ప్రాంతంలో తమ సేవల్ని పెంచుకున్నాయని ఇంటిగ్రేటేడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో కొత్తగా 328 టవర్లు, మొత్తం 328 బీటీఎస్‌లు ఏర్పాటు చేశారు. ఎయిర్‌టెల్ కొత్తగా 287 సైట్స్ (టవర్స్), 78 సెల్స్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసింది.