Attack On Mahakumbh Mela Train: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు (Maha Kumbhmela) వెళ్లే రైలుపై మంగళవారం దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని చతర్‌పుర్ రైల్వే స్టేషన్‌లో ఆగిన ట్రైన్‌పై ప్రయాణికులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రైలు రావడం ఆలస్యమైందని.. అయినా లోపల ఉన్న ప్రయాణికులు డోర్లు తీయడం లేదని స్టేషన్లోని ప్రయాణికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్లాట్ ఫాంపై ఉన్న వ్యక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రైలుపై రాళ్లు విసిరారు. చతర్‌పుర్, హర్పల్‌పుర్ రైల్వే స్టేషన్లలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, రైళ్లపై దాడి జరిగిన ఘటన గురించి తమకు సమాచారం అందినట్లు జాన్సీ రైల్వే డివిజన్ పీఆర్వో మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. రైలు లోపల ఉన్న ప్రయాణికులు డోర్లు తీయకపోవడంతో ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు తీవ్ర అసహనంతో రాళ్ల దాడి చేసినట్లు చెప్పారు. అప్పటికే రైలు కిక్కిరిసిపోవడంతో చాలామంది రైలు ఎక్కలేకపోయినట్లు పేర్కొన్నారు.
ప్రత్యేక రైళ్లు..
మరోవైపు, ప్రయాగరాజ్‌లో కుంభమేళా ఘనంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 8 కోట్ల మంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా జరగనుండగా.. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అటు, బుధవారం మౌనీ అమావాస్య సందర్భంగా ఒక్కరోజే సుమారు 10 కోట్ల మంది వస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. సంగంకు వెళ్లే స్థానికులు ఫోర్ వీలర్లు కాకుండా.. టూ వీలర్లు వాడాలని ప్రభుత్వం సూచించింది. అటు, పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో నిఘా తీవ్రం చేశారు. మౌనీ అమావాస్య ప్రత్యేకత దృష్ట్యా ఈ నెల 28, 29, 30 తేదీల్లోప్రయాగ్‌రాజ్‌లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
అటు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భారీగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటగంటకూ రైళ్లు నడుపుతోంది. మహా కుంభమేళాకు విచ్చేసే భక్తుల కోసం రైల్వే వివిధ మార్గాల్లో రైళ్లను నడుపుతుండగా, ప్రయాగ్ రాజ్ చుట్టుపక్కల స్టేషన్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీతో కూడిన స్టేషన్లలో ఒకటైన పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ్ జంక్షన్ వద్ద పరిస్థితిని నియంత్రించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్యాసింజర్ హాలుతో పాటు స్టేషన్ ఆవరణలో భక్తులకు విశ్రాంతి కోసం హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. స్నానానికి వెళ్లే భక్తులందరినీ వీలైనంత త్వరగా స్నానానికి తీసుకెళ్లి.. అంతే త్వరగా తిరిగి రప్పించేలా గంట గంటకూ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది.
Also Read: Mona Lisa: పది రోజుల్లో పది కోట్లు సంపాదించిన మోసాలిసా - ఆమె ఏమంటున్నారో తెలుసా?