Nagoba Jatara in Keslapur of Indervelli mandal in Adilabad | కేస్లాపూర్: రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన వేడుక నాగోబా జాతర నేడు ప్రారంభం కానుంది. జాతరకు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిందని అదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. మెస్రం వంశీయుల సాంప్రదాయాల నడుమ నాగోబా జాతరను నిర్వహిస్తారని వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. జాతర బందోబస్తుకు విచ్చేసిన సిబ్బందికి నిత్యవసర వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్టును సిబ్బంది ప్రతి ఒక్కరికి అందజేశారు.
నేటి రాత్రి గంగాభిషేకం..
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. సిబ్బంది ప్రజల పట్ల నిదానంగా సత్ప్రవర్తతతో వ్యవహరించాలన్నారు. ఈ జాతర జనవరి 28 రాత్రి గంగాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4 వరకు జరగనుంది. జాతర మొత్తాన్ని ఆరు సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు కేటాయించిన స్థలాలలో మూడు షిఫ్టులలో సిబ్బంది ఉంటూ విధులను నిర్వర్తించాలని సూచించారు. జాతర మొత్తాన్ని ఒక డ్రోన్ కెమెరా, 100 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ల ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధులను నిర్వర్తించే సమయంలో గుర్తింపు కార్డులను ధరించాలని సూచించారు. కేటాయించిన విధులను పర్యవేక్షించేందుకు మూడు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలను పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశామన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించినట్లయితే శాఖా పరమైన చర్యలు తప్పవన్నార. ఎటువంటి అత్యవసర పరిస్థితిలోనైనా హెల్ప్ డెస్క్ లేదా రిసెప్షన్ సెంటర్లను సంప్రదించాలని సూచించారు.
నాగోబా జాతరలో మద్యం, మాంసానికి అనుమతి లేదు
నాగోబా జాతరలో ఎలాంటి మద్యం, మాంసాహారానికి అనుమతులు లేవన్నారు. ఎవరైనా మద్యం అమ్మడానికి చూస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి పాయింట్ బుక్ లను అందజేశాం, జాతరకు విచ్చేసిన కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా సిబ్బందికి కావలసిన కనీస అవసరాలతో కూడిన కిట్టును అందజేశారు. జాతర సమయంలో బైక్ పెట్రోలింగ్, ఫుట్ పెట్రోలింగ్, షీ టీం, పార్కింగ్, ఎగ్జిబిషన్, బందోబస్తు, మఫ్టీ పార్టీలో, పోలీసులు విధులను నిర్వర్తిస్తుంటారని తెలిపారు. సిసిఎస్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అత్యవసర సమయాలలో అగ్నిమాపక వాహనం, అంబులెన్స్ వాహనాలకు అన్ని ప్రదేశాలకు వచ్చే విధంగా సిబ్బంది రోడ్డుపై అప్రమత్తమే విధులు నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి, భోజనశాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు సీహెచ్ నాగేందర్ గౌడ్, పోతారం శ్రీనివాస్, నార్నూర్ సీఐ రహీం పాషా, ఉట్నూర్ సీఐ జి.మొగిలి, సీసీఎస్ సీఐ. చంద్రశేఖర్, ఎస్సైలు దుబ్బాక సునీల్, మనోహర్, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: Nagoba Jatara: గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు, ఇక అందరి దారి అటువైపే