Tirumala: తిరుమలలో లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరిగిందని నిర్దారించిన టీటీటీ.. పరిహారంగా శాంతి హోం నిర్వహిస్తోంది. ఉదయం ఆరు గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. కోట్ల మంది భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న కారణంతో తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి శాంతి హోమం చేపట్టింది. పది గంటల వరకు శాస్త్రబద్ధంగా ప్రక్రియను చేపడతారు. ఈ శాంతి హోమాన్ని ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితుల ఆధ్వర్యంలో జరుగుతోంది. 


ఏటా తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ సంవత్సరంలో జరిగే తప్పులను అపచారాలకు పరిష్కారంగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆగస్టు 15 నుంచి 17 వ తేదీ వరకు ఈ పవిత్రోత్సవాలు జరిపారు. తొలిరోజు పవిత్ర ప్రతిష్ట, రెండో రోజు పవిత్ర సమర్పణ, మూడో రోజు పూర్ణాహుతి, పవిత్ర వితరణతో ప్రక్రియను ముగిస్తారు. 


లడ్డూతో జరిగిన అపవిత్రత కూడా ఆ ఉత్సవంతో పోయిందని ఆగమ సలహా మండలి చెబుతోంది. లడ్డూ వివాదం శాస్త్ర బద్దంగా తొలగిపోయినా.. శ్రవణం ద్వారా పాప దోషం పోవడానికి, భక్తుల్లో ధైర్యం నింపడానికి ఇప్పుడు శాంతి హోం నిర్వహించారు. శ్రీనివాసుడి ఆలయంలోని బంగారు బావి సమీపంలో యాగశాల ఏర్పాటు చేశారు. అందులో మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఇందులో మహా శాంతి యాగం, వాస్తు హోమం నిర్వహించారు. లడ్డూ తయారు చేసే పోటు, అన్నప్రసాదాల తయారీ వద్ద పంచగవ్యాలతో ప్రోక్షణం చేశారు. 8 మంది తిరుమల శ్రీవారి ఆలయంలోని అర్చకులు, ఆగమ సలహాదారులు హోమం నిర్వహించారు. శ్రీవారికీ నిత్యం జరిగే ఆర్జిత సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా యాగాన్ని ఒక్క రోజు మాత్రమే నిర్వహించారు. 


వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్నందున అక్టోబర్‌ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ చేయనున్నారు. అంటే ప్రతి వస్తువు, గర్భాలయం, గోడలు, పై కప్పు, ఉప ఆలయాలు ఇలా అన్నింటిని శుభ్రం చేస్తారు. తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని ప్రోక్షణ చేస్తారు. 


దేవాదాయశాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో యాగాలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆయా దేవాలయాల్లో ముడిసరకులు సరిగా ఉన్నాయో లేవే పరిశీలించాలని ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రికి సూచించినట్టు చెప్పారు. ఇప్పుడు జరిగిందని చాలా పెద్ద అపచారమని... తిరుమలేశుడి ఆలయ పవిత్రత దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. 


Also Read: తిరుమలలో శాంతి హోమం ఎలా నిర్వహిస్తారు, పంచగవ్యాలతో ప్రోక్షణం