అనంతపురం: రాయలసీమలో ఆఖరి ఎకరా వరకు సాగు నీరు, తాగునీరు అందించాలనే ఆలోచనలో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలన చేపట్టినట్లు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో ముందుకు వెళ్తున్న ఇరిగేషన్, ప్రాజెక్టులు నిర్వీరమైపోయి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాయన్నారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ టీడీపీ హయంలో ఏర్పడ్డాయన్నారు.
సీమను సస్యశ్యామలం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు
గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖకు కేవలం 49 కోట్లు బడ్జెట్ కేటాయించారని, అందులో ఖర్చు చేసింది కేవలం రూ.31 కోట్లు మాత్రమేనన్నారు. మొత్తం 12 లక్షల కోట్ల బడ్జెట్ లో కేవలం 2.2 శాతం ఇచ్చారన్నారు. రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతానికి ఏ సీఎం చేయన్నత ద్రోహం జగన్ చేశారన్నారు. హంద్రీనీవాకు టీడీపీ ప్రభుత్వంలో రూ.4,200 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వ హయాంలో కనీసం రూ. 500 కోట్లు ఖర్చు చేయలేదన్నారు. నీటిపారుదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సీమను సస్యశ్యామలం చేసేందుకు సీమ ప్రాజెక్టులపై దృష్టి సారించడం జరిగిందన్నారు. రాయలసీమలో హంద్రీనీవా కాల్వ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు అని, గత పాలకుల తీరుతో 1,800 క్యూసెక్కులు కూడా రావడం లేదన్నారు. ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్నారన్నారు. వచ్చే ఏడాది సీజన్ కి 3,850 క్యూసెక్యుల నీరు ప్రవహించేలా మెయిన్ కెనాల్ విస్తరణకు ప్రణాళిక చేస్తున్నామన్నారు. మెయిన్ కెనాల్ ను వెంటనే విస్తరించి బీటిపీ, పేరూరు, హెచ్ఎన్ఎస్ఎస్ 36వ ప్యాకేజీ, హెచ్.ఎల్.సి, ఎంపిఆర్ డాం, పరిధిలో అన్నింటికి తాగు, సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను వరప్రసాదినిగా మార్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Also Read: Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయిలో నిండాయి
తుంగభద్ర డ్యాం 19 గేటు కొట్టుకుపోతే... వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కన్నయ్య నాయుడుని పిలిపించి దేశ చరిత్రలో 70 టీఎంసీల నీరు ఉన్నప్పుడే స్టాప్ లాక్ గేట్ పెట్టామన్నారు. సీమ జిల్లాలకు అన్యాయం జరగకుండా పని చేశామన్నారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తూ... ప్రాజెక్టులు నింపుకుంటూ వస్తున్నామన్నారు. రిజర్వాయర్లలో ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి నీరు నిల్వ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయిలో నిండాయని, గత ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడంతో నీరు నిల్వ చేయలేక పోయారన్నారు. పోలవరానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీరు తరలించే అవకాశం ఉందన్నారు.
Also Read: Chandrababu On Tirumala Laddu: వెంకటేశ్వరస్వామి వాళ్ల అకౌంట్స్ సెటిల్ చేస్తాడు - లడ్డూ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు