TTD Chairman BR Naidu | తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం రెండు, మూడు గంటల్లో చేయించడం అసాధ్యమని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం (Lv subrahmanyam) అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడు ఆయన వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఎల్వీ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిఫీషియల్ ఇంజెలిజెన్స్ ద్వారా తిరుమలలో ఒక గంటలో స్వామివారి దర్శనం చేయించడం సాధ్యం కాదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి దర్శనం రెండు, మూడు గంటల్లో చేయించడం సాధ్యం కాదని.. ఏఐ టెక్నాలజీ వేగంగా దర్శనం విధానం ఆలోచనలు విరమించుకోవాలని టీటీడీకి, ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.

Continues below advertisement


‘తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్న క్రమంలో కొందరు భక్తుల మాటలు విన్నాను. త్వరలోనే ఆర్టిఫీషియల్ ఇంజెలిజెన్స్ ద్వారా కేవలం రెండు, మూడు గంటల్లో శ్రీవారి దర్శనం చేయిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీని గమనిస్తే మూడు గంటల్లో స్వామివారి దర్శనం చేయించడం అసంభవం. మరోవైపు ఇది అంత మంచి ప్రయత్నం కాదు. ఐఏ టెక్నాలజీని ఎంత వాడినా తిరుమల ఆలయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి బదులుగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దర్శనానికి సంబంధించిన మరిన్ని సౌలభ్యాలు కల్పించడంపై దృష్టిపెట్టాలని’ టీటీడీకి, ఏపీ ప్రభుత్వానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. 


ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన టీటీడీ ఛైర్మన్
టీటీడీ మాజీ ఈవో, మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. తిరుమలలో ఏఐ టెక్నాలజీ వినియోగించవద్దని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు సరికాదని ఓ ప్రకటన విడుదల చేశారు. 






తిరుమలలో స్వామివారి దర్శనం కోసం వైకుంట క్యూ కాంప్లెక్స్ లో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు గూగుల్, టీసీఎస్ లాంటి సంస్థల సహకారంతో ఏఐ టెక్నాలజీ వినియోగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు. కేవలం 2 గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం చేయించాలని టీటీడీ చేస్తున్న ప్రయత్నాలు, ఐఏ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. భక్తుల్లో ఆందోళన కలిగించేలా టీటీడీ మాజీ ఈవో మాట్లాడం సమంజసం కాదన్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా వారి ఇబ్బందులు తొలగించాలని చూడటంలో ఏ తప్పులేదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.