Tirumala News Updates | తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple)లో ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 4న అంకురార్పణతో తిరుమలలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల తిరుమల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం Tirumala శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
శతాబ్ధాల కిందటే తిరుమల ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమలలో పవిత్రోత్సవాలు 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం (TTD) ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. తిరుమలలో పవిత్ర ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 5న పవిత్రాల ప్రతిష్ట కార్యక్రమం, ఆగస్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శ్రీవారి ఆర్జితసేవలు రద్దుతిరుమల ఆలయంలో పవిత్రోత్సవాల్లో ఆగస్టు 4న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్ధు చేసింది. ఆగస్టు 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుప్పావడ సేవతో పాటు ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు సైతం రద్దు చేసినట్లు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి వెల్లడించారు.