Viral Video: ప్రకాశం జిల్లా దర్శిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క రైతు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి విడతలో 5000 రూపాయలు జమ చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తూర్పు వీరాయపాలెంలో రైతులు, ప్రజలతో ముచ్చటించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతలు దీనిపై ట్రోల్ చేస్తున్నారు. 

Continues below advertisement


రైతులతో ముచ్చటించిన చంద్రబాబు.... తాను ఉన్నంత వరకు రైతులకు భరోసా ఉంటుందని చెప్పారు. ఇలా చెప్పే క్రమంలో చేసిన పొరపాటును వైసీపీ ట్రోల్‌ చేస్తోంది. ఆయన ఏమన్నారంటే...""చంద్రన్న ఉన్నంత వరకూ రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్" అంటు చెప్పుకొచ్చారు. రైతు భరోసాకు డోకా లేదని చెప్పబోయే భరోసా లేదని చెప్పడంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయ్యింది. ఆయన మాటలను పోస్టు చేస్తు లెస్సపలికితిరి అంటూ ట్రోల్ చేస్తోంది. 


వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో చంద్రబాబు కామెంట్స్‌ పోస్టు చేసి"మొత్తానికి మనసులో మాట బయట పెట్టేశారు మోసకారి బాబు. వ్యవసాయం దండగ అంటూ గతంలో రైతులను మోసం.. ఇప్పుడు పెట్టుబడి సాయం ఎగవేసి వెన్నుపోటు. వ్యవసాయంను చీదరించుకునే నీలాంటి వ్యక్తి సీఎంగా ఉంటే రైతులకు భరోసా ఎలా ఉంటుంది" అని ప్రశ్నించింది. 
 
ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా చంద్రబాబు వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నిజం ఒప్పుకున్నారని విమర్శలు చేస్తున్నారు. ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు ఉద్దరిస్తున్నట్టు కబుర్లు చెప్పి అడ్డంగా దొరికిపోయారని ఆరోపిస్తున్నారు. 






దీనికి టీడీపీ నేతల నుంచి భిన్నమైన కౌంటర్ వస్తుంది. నిజమే రైతు భరోసా అనేది వైసీపీ పథకమని అందుకే భవిష్యత్‌ ఎప్పటికీ ఆ పథకం కనిపించదని చంద్రబాబు చెప్పారని అంటున్నారు. ఇకపై శాశ్వతంగా ఉండేది అన్నదాత సుఖీభవ పథకమేనని అంటున్నారు. అందుకే చంద్రబాబు అలా చెప్పి ఉంటారని కవర్ చేస్తున్నారు. 


ఈ స్పీచ్ ఒకటే కాకుండా ఈ కార్యక్రమం కోసం టీడీపీ సినిమా సెట్టింగ్‌లతో సెట్‌లు వేసిందని ఆరోపిస్తోంది వైసీపీ. దీనికి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.