Tirumala News: తిరుపతిలో జరిగిన దురదృష్ట ఘటన ఎంతో బాధాకరమని మడకశిర ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిందని వెల్లడించాడు. "ప్రపంచంలోని వెంకటేశ్వర స్వామి భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా దేవుడిని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు. ఈ కార్యక్రమం కోసం తిరుపతి వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేసింది. 90 కౌంటర్లలో టోకెన్లను భక్తులకు అందించేందుకు సిద్ధమైంది. ఈ టోకన్లు తీసుకునే సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించటం బాధాకరం. " అని అన్నారు. 


తిరుమల తొక్కిసలాట ఘటనలో వైసీపీ పాత్ర: ఎంఎస్ రాజు 


ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనను కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని వైసీపీని ఉద్దేశించి టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న టైంలో కొందరు అస్వస్థకు గురియ్యారని  తెలిపారు. అక్కడ ఉన్న సిబ్బంది వారిని బయటకి తీసుకొచ్చేటప్పుడు తొక్కిసలాట జరిగిందన్నారు. ఆ టైంలో వెనుకున్న వాళ్లు అరుపులు కేకలతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని చెప్పుకొచ్చారు. ఇది కావాలనే కుట్రపూరితంగా ఎవరైనా చేశారా అన్న కోణంలో విచారణ జరుపుతామని చెప్పారు. 
తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందన్న ఎంఎస్ రాజు చేసిన ఆరోపణలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వీడియోలు ఫోటోలు ముందుగా వైసీపీ సోషల్ మీడియాలోనే ప్రత్యక్షం అయ్యాయని ఆయన అన్నారు. దీని బట్టి చూస్తుంటే శవ రాజకీయాలు చేసే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వారి పార్టీ నేతలు కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు రాజు. 


Also Read: తిరుపతి తొక్కిసలాట ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు - అధికారులపై తీవ్ర ఆగ్రహం


ప్రభుత్వ యంత్రాంగమంతా తిరుమలలోనే: ఎంఎస్‌రాజు


జరిగిన ఘటన ఎంతో బాధాకరమన్న రాజు... ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అధికార యంత్రాంగం తిరుపతిలో పని చేస్తుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే పనిలో ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీ మాత్రం విష ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఆప్రదిష్టపాలు చేయడానికి కంకణం కట్టుకుందని మండిపడ్డారు. వీలైతే చనిపోయిన వ్యక్తులకు పార్టీ తరపున సహాయం చేయండి లేకుంటే సైలెంట్‌గా ఉండండి అంటూ వైసిపి నేతలకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చురకలంటించారు. భక్తులు ఎవరూ కూడా వైసీపీ చేస్తున్న ప్రచారాలు నమ్మవద్దని రాజు సూచించారు. యథావిధిగా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు అని చెప్పారు. టిటిడి అన్ని భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేసిందని వివరించారు. 


Also Read: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అసలు తప్పెవరిది? - సీఎం చంద్రబాబుకు నివేదిక, ఏ సమయంలో ఏం జరిగిందంటే?