AP Government Compensation To Deceased Persons Families In Tirupati Stampede Incident: తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం (AP Government) పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satyaprasad) ప్రకటించారు. కాగా, బుధవారం రాత్రి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో బైరాగిపట్టెడలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తోపులాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 48 మంది గాయపడగా వారిని రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.
అటు, మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి గురువారం పరామర్శించారు. స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఘటనపై పూర్తి కారణాలు విచారణలో వెల్లడవుతాయని చెప్పారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని.. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు.
అటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత అన్నారు. తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని.. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.
సీఎం చంద్రబాబుకు నివేదిక
అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు నివేదిక అందించారు. 'తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాలైనా అతను అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు.' అని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి నివేదికలో పొందుపరిచారు. సీఎం చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మరోవైపు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సైతం గురువారం మధ్యాహ్నం క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
మరోవైపు, గురువారం ఉదయం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలవారు స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని వైద్యులు డిశ్చార్జి చేశారని చెప్పారు. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని.. వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ జరిగింది
కాగా, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం.. తిరుపతిలోని 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో బైరాగిపట్టెడ వద్ద తోపులాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయాలయ్యాయి.