AP CM Chandrababu Visited Tirupati Stampede Place: తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) పరిశీలించారు. ఈ ఘటనపై సమీక్షించిన అనంతరం విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో చెప్పాలని నిలదీశారు. 'ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దు. భక్తులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారు అదే ఆలోచనలో ఉంటారు. ఆ సమయంలో మీరు గేట్లు ఎలా తెరుస్తారు. ఇది బాధ్యతారాహిత్యం కాదా.?. ఓ భక్తురాలు అస్వస్థతకు గురైనప్పుడు ఆ విషయం అనౌన్స్ చేయాలి కదా.' అని నిలదీశారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.



అనంతం అంబులెన్సుల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. ఆయన వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, హోం మినిస్టర్ అనిత, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.


మృతుల కుటుంబాలకు పరిహారం


అటు, మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satyaprasad) ప్రకటించారు. మంత్రులు అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఘటనపై పూర్తి కారణాలు విచారణలో వెల్లడవుతాయని చెప్పారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని.. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. 'సమన్వయ లోపమా.. పోలీసుల వైఫల్యమా అనేది దర్యాప్తులో తేలాలి. పూర్తి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటాం.' అని పేర్కొన్నారు.


కాగా, ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం బైరాగిపట్టెడలోని టోకెన్ జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి ఒక్కసారిగా తోపులాట జరిగి దుర్ఘటన చోటు చేసుకుంది. అటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సైతం క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Also Read: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం