ఇటీవల కాలంలో థియేటర్లలోకి వస్తున్న కొత్త సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్ల విషయంలో జోరుగా రూమర్స్ నడుస్తున్నాయి. సినిమా థియేటర్లలోకి వచ్చీ రాకముందే ఫలానా సినిమా, ఫలానా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ ప్రచారాన్ని మొదలెట్టేస్తున్నారు. దీంతో మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తమ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై వస్తున్న పుకార్లను కొట్టి పారేయాల్సి వస్తుంది. అఫీషియల్ గా స్పందించి, అసలు విషయం ఏంటి అనే దానిపై క్లారిటీ ఇస్తూ ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు నిర్మాతలు. నిన్నటికి నిన్న డబ్బింగ్ మూవీ 'మార్కో' విషయంలో ఇలాగే జరగగా, తాజాగా 'యూఐ' మూవీ ఓటీటీ రూమర్స్ పై మేకర్స్ స్పందించారు.
అవన్నీ ఫేక్ వార్తలే
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'యూఐ'. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 60 కోట్ల బడ్జెట్ తో రూపొంది, 30 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే మూవీ టైటిల్స్ లోనే సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని ఈ మధ్యకాలంలో మేకర్స్ ముందే వెల్లడిస్తున్నారు. కానీ 'యూఐ' విషయంలో మాత్రం దీన్ని సస్పెన్స్ లో ఉంచగా, సన్ నెక్స్ట్ ఓటీటీ మూవీ ఓటీటీ రైట్స్ ని దక్కించుకుందనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా నిర్మాత కె.పి శ్రీకాంత్ ఈ వార్తలపై స్పందిస్తూ, అవన్నీ పుకార్లేనని కొట్టి పడేశారు. ఈ మేరకు ఒక స్పెషల్ నోట్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
అందులో "ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్... సోషల్ మీడియాలో కొన్ని ఫాల్స్ న్యూస్ సర్కులేట్ అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. 'యూఐ' మూవీ ఓటీటీ రైట్స్ ని సన్ నెక్స్ట్ దక్కించుకుందని సోషల్ మీడియాతో పాటు ఇతర ప్లాట్ ఫామ్స్ లో ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఫేక్ న్యూస్. 'యూఐ' టీం మాత్రమే ఈ సినిమా ఓటీటీ రైట్స్ తో పాటు ఇతర అప్డేట్స్ గురించి అఫీషియల్ గా అప్డేట్స్ ఇస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పుకార్లను నమ్మకండి, ప్రచారం చేయకండి. సరైన అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి" అంటూ అందులో రాసుకొచ్చారు.
నిన్న 'మార్కో', నేడు 'యూఐ'
నిన్నటిదాకా 'మార్కో' మూవీ విషయంలో కూడా ఇలాంటి రూమర్స్ సర్క్యులేట్ అయ్యాయి. ఈ మూవీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందనే వార్తలు రావడంతో, చిత్ర బృందం అఫీషియల్ గా స్పందిస్తూ అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసింది. ఇప్పుడు 'యూఐ' కూడా ఇదే బాటలో నడిచింది.
'యూఐ' ఏ ఓటీటీలో?
మరి ఇప్పుడు 'యూఐ' మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇంస్టాగ్రామ్ లో చిత్ర బృందం పోస్ట్ చేసిన ఆ పోస్టర్లో జీ కన్నడ, జీ స్టూడియోస్ లోగోలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ మూవీ టెలివిజన్ రైట్స్ ని జీ నెట్వర్క్ దక్కించుకుందని, అలాగే ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను చేసి చేజిక్కించుకుందని సమాచారం. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.