Tirupati Police filed case againt Bhumana Karunakar Reddy | తిరుమల: తిరుమల లడ్డూ వివాదం పీక్స్ కు చేరింది. వైసీపీ వర్సెస్ కూటమి నేతలుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై స్పందించిన పోలీసులు భూమనపై కేసు నమోదు చేశారు. మొత్తం 5 సెక్షన్ల కింద తిరుపతి పోలీసులు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనపై కేసు నమోదు చేశారు. కులమతాలు మధ్య విద్వేషాలు రెచ్చగోట్టేలా ప్రసంగించారని, భక్తులు మనోభావాలు దెబ్బతీసారని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు బుక్ చేశారు. 


అఖిలాండం వద్ద భూమన ప్రమాణం..


‘నిజాయితీకి భయపడుతున్నారు, నిర్భీతికి వణుకి పోతున్నారు.. లడ్డు ప్రసాదాలు పై అబాండం మోపడం ద్వారా రాజకీయ బలం పెరుగుతుందని కుట్ర చేశారంటూ భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమల విషయంలో గత ప్రభుత్వం ఏ తప్పిదం చేయలేదని, తప్పు చేసిన వారు సర్వనాశనం అయిపోవాలని స్వామివారిని కోరుకుంటూ భూమన అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు. అంతకుముందు కోనేరులో పుణ్యస్నానం ఆచరించారు. ప్రమాణం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను నమ్మించేందుకు నెయ్యి బదులు జంతు కొవ్వు వాడారని మాపై ఉద్దేశపూర్వకంగానే నిందను మోపారు, బలమైన విష ప్రయోగం చేశారు. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.


మీరు చేసిన ఆరోపణలు నిజం అయితే మేము నాశనం అయిపోతామని స్వామి పుష్కరిణిలో ప్రమాణం చేశాను. నీటితో, నిప్పుతో ఏ తప్పు చేయలేదు అని ప్రమాణం చేశా. రాజకీయ ప్రసంగం చేస్తున్నానంటూ  అఖిలాండం నుంచి నన్ను లాగి పంపించేశారు, ఇది చంద్రబాబులో భయాన్ని  తెలుపుతుంది. అలిపిరి వద్ద నుంచి కూడా పోలీసులు  నన్ను అడ్డుకుంటూనే ఉన్నారు. తప్పు చేయకపోయినా నింద మోపితే అంగీకరించేది లేదు. తిరుమలలో కల్తీ అంశంపై సీబీఐ విచారణ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోరారు. మేం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మేరు ఏర్పాటు చేసే సిట్ ఏ విచారణలో ఏం వెలికి తీస్తుందో ప్రజలకు తెలుసు. కనుక సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించండి. కూటమి హయాంలోనే ఏఆర్ సంస్థ నెయ్యి ట్యాంకర్ పంపించారు. ఆగస్టు నెలలో పవిత్రోత్సవాలు నిర్వహించినా.. మళ్ళీ శాంతి హోమం నిర్వహించారు. సెంటిమెంట్ తో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు.’  - భూమన కరుణాకర్ రెడ్డి


చంద్రబాబు నాలుకను శుద్ధి చేయాలి


శుద్ధి చేయాల్సింది ఆలయాలను కాదు. చంద్రబాబు నాలుకను శుద్ధి చేయాలి. సీఎం చంద్రబాబు తిరుమల విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు. కనుక సీబీఐతో గానీ, సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జి తో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు సార్లు టిటిడి చైర్మన్ గా, మూడుసార్లు టీటీడీ పాలక మండలి సభ్యులుగా నాకు అవకాశం కల్పించారు.  హిందూ సాంప్రదాయంలోనే నా కూతురు వివాహం జరిగింది. ఆ వేడుకకు కుర్తాళం పీఠాధిపతి, స్వరూపానంద స్వామి హాజరయ్యారు. మీ వియ్యంకుడు బాలకృష్ణ నా కూతురు వివాహానికి హాజరయ్యారు. ఏ సాంప్రదాయంలో వేడుక జరిగిందో ఆయన్ని అడిగి చంద్రబాబు తెలుసుకోవాలి. మీరు మాత్రం తిరుమల నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనె కలిపారని ఈవో చేత చంద్రబాబు చెప్పించారు. చంద్రబాబు మెదడులో కుళ్లు ఉందని అందరికి తెలుసు. ప్రజలకు నిజాలు తెలియాలంటే ఉన్నతస్థాయిలో విచారణ జరగాలన్నారు’ భూమన కరుణాకర్ రెడ్డి.