Dharmavaram EX MLA Kethireddy went to meet YSRCP activists at sub Jail | ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను చూసేందుకు కేతిరెడ్డి సబ్ జైలు (Dharmavaram Sub Jail)కి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. 


ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రిమాండ్ లో ఉన్న పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు స్థానిక సబ్ జైలుకు వెళ్లారు. అయితే వైసీపీ నేత కేతిరెడ్డి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న జనసేన, టీడీపీ కార్యకర్తలు సైతం భారీ ఎత్తున సబ్‌ జైలు వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించి వెళ్తున్న కేతిరెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓ టీడీపీ కార్యకర్త కేతిరెడ్డి వాహనం పైకి ఎక్కగా, డ్రైవర్ అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దాంతో టీడీపీ కార్యకర్త డివైడర్ పక్కన రోడ్డు మీద ప‌డిపోవ‌డంతో ఉద్రిక్తత నెలకొంది. 


మరో వాదన ఏంటంటే..
కూటమి నేత హరీశ్ (బీజేపీ) తన అనుచరులతో వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు ఆ వాహనాలను అడ్డుకున్నారు. దారి ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు కేతిరెడ్డి వాహనం డ్రైవర్ తో గొడవకు దిగారు. ఈ క్రమంలో కేతిరెడ్డి డ్రైవర్ ను తమకు దారి ఇవ్వవా అంటూ బీజేపీ నేత హరీశ్ వర్గీయులు చితకబాదినట్లు తెలుస్తోంది. సబ్ జైలుకు వచ్చి రిమాండ్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించి వెళ్లే సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Also Read: AP Floods Amount: ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ


కేతిరెడ్డి నీ ధర్మవరం పట్టణానికి రాకుండా బహిష్కరించాలి : చిలక మధుసూదన్ రెడ్డి 


ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం పట్టణంలోకి రాకుండా బహిష్కరించాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధర్మవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేతిరెడ్డికి ధర్మవరం ప్రజలు ఓటమి రుచి బుద్ధి చెప్పినప్పటికీ తన రౌడీ రాజకీయాలు మానుకోవడం లేదని ఇలాంటి వ్యక్తి ధర్మవరం పట్టణంలోకి రావడంతో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. తన అనుచరులను పరామర్శించుకోవడానికి వచ్చిన కేతిరెడ్డి తన వెంట రౌడీ మూకలను వెంటబెట్టుకుని రావడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారం దూరమై మూడు నెలలు అయినప్పటికీ కేతిరెడ్డి ఓటమిని జీర్ణించుకోలేక రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఇటువంటి చేష్టలు చేయడం మంచిది కాదన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి కేతిరెడ్డిని ధర్మవరం పట్టణ బహిష్కరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


Also Read: Tirupati Laddu controversy | కేంద్రం చేసిన పరీక్షల్లోనూ బయటపడిన కల్తీ - ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్య శాఖ నోటీసులు