Flood Victims In Andhra Pradesh | అమరావతి: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన మొత్తం కంటే వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు (సెప్టెంబర్ 23న) ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో వరద బాధితులకు సెప్టెంబర్ 25న పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.
179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ప్రకటించిన సాయాన్ని పెంచారు. ఎస్ఆర్ఎఫ్ రూ.11 వేలు నిర్దేశించగా.. ఏపీ ప్రభుత్వం ఆ సాయం మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచింది. ఎస్ఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే వరద బాధితులకు అదనంగా ఆర్థిక సాయం చేసేందుకుగానూ స్కేల్ ఆఫ్ ఫైనాన్సు మార్చుతూ రాష్ట్ర ఉత్తర్వులు ఇచ్చింది. ఆగస్టు నెలాఖరులో, సెప్టెంబర్ ప్రారంభంలో వచ్చిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వరద బాధితులకు సెప్టెంబర్ 17న సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు ఆర్ధిక సాయం పెంచుతున్నట్లుగా రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
నష్టపరిహారంపై ఇటీవల ప్రభుత్వం ప్రకటన
రాష్ట్రంలో వరదలతో ప్రభావితం అయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం, ఇళ్లలోకి నీరు వచ్చిన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవారికి రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించడం తెలిసిందే. చిరు వ్యాపారులకు రూ.25 వేల చొప్పున, ఆటో వంటి మూడు చక్రాలు ఉండే వాహనాలకు రూ.10 వేలు, టూవీలర్స్ దెబ్బతిన్న వారికి రూ.3 వేలు ఇస్తామన్నారు.
వరదల్లో నష్టపోయిన ఒక్కో కోడికిగానూ రూ.100, కోళ్ల ఫారం షెడ్డు డ్యామేజీ అయిన వారికి రూ.5 వేలు పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. గొర్రెలకు రూ.7,500, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, ఎడ్ల బండి కోల్పోయిన వారికి కొత్తవి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. చేనేత కార్మికులకు రూ.15 వేలు, నష్టపోయిన సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (MSME)ల్లో రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ పరిధి వాటికి రూ.1లక్ష, అంతకుమించి టర్నోవర్ ఉన్న వాటికి రూ.1.5 లక్షలు పరిహారం ఇస్తామన్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి పరిహారం వివరాలు
వ్యవసాయానికి సంబంధించి ఒక హెక్టారు (2.47 ఎకరాలు) పత్తికి రూ.25 వేలు, వేరు శనగ అయితే రూ.15 వేలు, వరి ఎకరాకు రూ.10 వేలు, చెరకు రూ.25 వేలు పరిహారం ఇవ్వనున్నారు. పసుపు, అరటికి రూ.35 వేలు, మొక్క జొన్న, రాగులు, కొర్ర, సామలకు హెక్టారుకు రూ.15 వేలు, హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15 వేలు అందించనుంది ప్రభుత్వం. మత్స్యకారుల ఫిషింగ్ బోట్, వల పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు, పాక్షికంగా దెబ్బ తింటే రూ.9 వేలు ఇస్తామన్నారు. సెరీ కల్చర్‌కు రూ.6 వేలు ఇస్తారు.