Future Plans To Control Floods: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన విజయవాడ (Vijayawada) నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. బుడమేరు, కృష్ణా నదికి వచ్చిన వరద ఉద్ధృతి లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. శరవేగంగా విస్తరిస్తోన్న విజయవాడ నగరం.. అటు, రాజధాని అమరావతి నగరాలకు భవిష్యత్తులో ముంపు సమస్య అనేదే లేకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బుడమేరు ముప్పు, కృష్ణా నదికి భవిష్యత్తులో భారీ వరదలను ఎదుర్కొనే క్రమంలో బహుముఖ వ్యూహం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి దీర్ఘకాలిక ప్రణాళిక, యుద్ధప్రాతిపదికన కార్యాచరణ అవసరం అంటున్నారు నిపుణులు. రూ.వేల కోట్లు ఖర్చయినా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అవసరమైతే ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల రుణ సహకారంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
వరదలకు ఇదే కారణం
- ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటి ప్రవాహ సామర్థ్యం 11.9 లక్షల క్యూసెక్కులు కాగా.. 2009 అక్టోబర్ 5న 10.94 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ఇప్పటివరకూ అదే అత్యధికం కాగా.. ఈ నెల 2న బ్యారేజీ రికార్డు స్థాయిలో 4 గంటల పాటు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. ఓ దశలో 12 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలూ జారీ అయ్యాయి. విజయవాడలోని కృష్ణలంక వంటి లోతట్టు ప్రాంతాల్ని వరద ముంచెత్తింది.
- పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మధ్యలో మున్నేరు, కట్టలేరు, వైరా, పాలేరు, కీసర, బుడమేరు వంటి వాగులు వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. భవిష్యత్తులో క్యాచ్ మెంట్ ఏరియాలో వర్షాలు పడితే వాగులు ఉద్ధృతమై ప్రకాశం బ్యారేజీకి ఇంకా వరద పోటెత్తే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీ డిశ్చార్జ్ సామర్థ్యాన్ని కనీసం 15 లక్షలకు పెంచాలి.
నిపుణులు ఏమన్నారంటే.?
- పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ కృష్ణా నది పొడవు 80 కి.మీలకు పైగా ఉంది. వైకుంఠపురంలో 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలి. ఇలా చేస్తే వరద పోటెత్తకుండా అడ్డుకోవడం సహా అక్కడ నీరు ఆ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది.
- బ్యారేజీ దిగువన 16 కి.మీల వద్ద చోడవరం సమీపంలో 1.70 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, 67 కి.మీల దిగువన బండి కొల్లంక వద్ద 4.70 టీఎంసీల సామర్థ్యంతో మరో వంతెన నిర్మించాలి.
- అటు, రాజధాని అమరావతి కోసం పటిష్ట చర్యలు చేపట్టాలి. అక్కడ నివసించే వారికి భవిష్యత్తులో ఎలాంటి ఆందోళనలు లేకుండా.. రాజధాని పొడవునా పటిష్టమైన కాంక్రీట్ కట్టడం నిర్మించాలి.
- గ్రీన్ ఫీల్డ్ నగరంగా పేరొందిన అమరావతిని నిర్మాణ దశలోనే అత్యాధునిక మురుగునీరు, వర్షపు నీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
- అటు, బుడమేరు వాగులో పూడిక, ప్రవాహ మార్గంలోని అనధికార కట్టడాలు, ఆక్రమణల్ని తొలగించాలి. వాగు డిశ్చార్జి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 6 - 7 వేల క్యూసెక్కుల నుంచి కనీసం 25 వేల క్యూసెక్కులకు పెంచాలి.
- బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచాలి. వాగు విస్తరణ పనుల్ని వెంటనే చేపట్టాలి. బుడమేరుపై సీడబ్ల్యూసీ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలి.
- బుడమేరు క్రాసింగ్స్ వద్ద కొత్త రైల్వే వంతెనల నిర్మాణానికి రైల్వే శాఖ వెంటనే చర్యలు చేపట్టాలి. విజయవాడ నగరంలో భూగర్భ మురుగు నీటిపారుదల, వాననీటి పారుదల వ్యవస్థల్ని అభివృద్ధి చేయాలి.
Also Read: Kurnool News: కర్నూల్ గణేష్ నిమజ్జనం ప్రత్యేకత ఏంటి? హైదరాబాద్ తర్వాత భారీ స్థాయిలో ఇక్కడేనా?