Tirupati Police filed case against Satyavedu MLA Koneti Adimulam | తిరుపతి: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధిస్తున్నారని పార్టీ కార్యకర్త ఆరోపించడం సంచలనం రేపింది. ఈ క్రమంలో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ మహిళా నాయకురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు చేశారు. తనను శారీరకంగానూ, మానసికంగానూ వేధింపులకు గురిచేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


భీమాస్ పారడైజ్ హోటల్ లో పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు కోనేటి ఆదిమూలంపై BNS  Cr:430/2024 కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్న భీమాస్ పారడైజ్ హోటల్ లో సీసీ ఫుటేజీని సేకరించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో ఆదిమూలం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 


సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే.   


లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఆదిమూలం 


పార్టీకి చెందిన మహిళ తనపై చేసిన లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తనను రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కోలేకనే, కొందరు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు తనను నమ్మాలన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో సత్యవేడు టికెట్ దక్కించుకున్నప్పటి నుంచే తనపై కుట్ర జరుగుతోందని చెప్పారు. టీడీపీ పేరు చెబుతూ, వెనకుండి వైసీసీ ఆడిస్తున్న డ్రామా ఇది అంటూ వేధింపుల ఆరోపణల్ని కొట్టిపారేశారు. తాను ఏ తప్పు చేయలేదని, తనవల్ల పార్టీకి ఏ నష్టం జరగదన్నారు. కొందరు కుట్ర చేసి, ఓ మహిళా నాయకురాలితో తనపై ఆరోపణలు చేయించారని, ఆరోపణలు తనను బాధించాయన్నారు. తను నిజంగానే ఓ మహిళను వేధించి ఉంటే దేవుడు చూసుకుంటాడని, శిక్ష వేస్తాడన్నారు. తనకు ఓటు వేసి గెలిపించుకున్న నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ జవాబుదారీగా ఉంటానని, త్వరలోనే నిజాలు బయటకొస్తాయని చెప్పారు. పార్టీ తనను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తాను ఏ తప్పు చేయలేదని నిరూపించానని కోనేటి ఆదిమూలం అన్నారు. 


ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బాధితురాలు మాట్లాడుతూ.. తిరుపతిలోని ఓ హోటల్ లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని టీడీపీకే చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. వేధింపుల విషయం బయటకు చెబితే, తనను, తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించారని మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనపై చేస్తున్న దాష్టీకాన్ని అందరికీ తెలిసేలా చేసేందుకు పెన్ కెమెరాలో వీడియోలు రికార్డ్ చేసినట్లు తెలిపారు. వేధింపులకు సంబంధించి తన వద్ద సాక్ష్యాలున్నాయంటూ పోలీసులను ఆశ్రయించారు. 


Also Read: సత్యవేడు ఎమ్మెల్యేపై టీడీపీ చర్యలు - పార్టీ నుంచి సస్పెండ్