Tirupati: ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్ చేతిలో లేనిదే రోజు గడవదు. కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే మొబైల్ ఫోన్లను కొందరు దొంగిలిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు వినూత్న ప్రయోగం చేపట్టారు. నైపుణ్య వృద్ది, నేరాల పరిశోధనలో సాంకేతిక మెలకువలు అందిపుచ్చుకున్న పోలీసు సిబ్బంది సహాయంతో దాదాపు 20 లక్షల రూపాయల విలువ గల 134 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు.
వివరాల్లోకి వెళ్ళితే.. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో రోజుకు రోజుకి మొబైల్ ఫోన్స్ మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఈక్రమంలో గత కొంత కాలంగా మొబైల్ మిస్సింగ్ పై ప్రత్యేక దృష్టి సారించిన తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు పోలీసు విభాగాన్ని సాంకేతిక, శక్తివంతంగా పరిపుష్టం చేయడానికి పలు కార్యచరణలు రూపొందించారు.. ఇందులో భాగంగానే నూతనంగా నియమించిన సిబ్బందికి నేరచేదన, సాంకేతికతను ఉపయోగించటంలో అనుభవజ్ఞులైన అధికారులతో ట్రైనింగ్ ఇప్పించారు.. పోలీసు సిబ్బందిలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారిని ఎంపిక చేసి సాంకేతికపరంగా తర్ఫీదు చేశారు.. తిరుపతి సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్ మిస్సింగ్ పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు..
ఇందులో భాగంగానే గత ఏడాది డిసెంబరు 2021 నుండి మార్చి 2022 వరకూ నేరాల పరిశోధనలోనే కాకుండా, సాంకేతికత మెలుకువలు అందిపుచ్చుకుని అత్యంత తక్కువ కాలపరిమితిలో ఫిర్యాదుదారులు పోగొట్టుకున్న సుమారు 20 లక్షల విలువ గల 134 మొబైల్ ఫోన్స్ లను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు రికవరీ చేశారు.. మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుండి ఫిర్యాదుదారుల మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు.. ఇందులో తిరుపతి వెస్టు-43, సైబర్ సెల్-28, తిరుపతి ఈస్టు-25, ఎస్వీ యూ క్యాంపస్-10, ఏర్పేడు-9, అలిపిరి-7, చంద్రగిరి-6, శ్రీకాళహస్తి రూరల్-5, గాజుల మండ్యం-1 వంటి పోలీసు స్టేషన్స్ లకు సంబంధించిన ఫోన్స్ ను రికవరీ చేసినా, ఇంకా రికవరి ప్రక్రియ కొనసాగుతునే ఉంది..
ఎస్పీ ఏం సూచనలు చేశారంటే...?
ఎవరైనా ఎక్కువ విలువగల మొబైల్ ఫోన్ ను తక్కువ ధరకు, సెకండ్ హ్యాండ్ రూపంలో అమ్మేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని కొనవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తిరుపతి ఎస్పీ వెంకట అప్పలనాయుడు ప్రజలను కోరారు.. ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనవలసి వస్తే సక్రమమైన బిల్లును చూసి కొనాలన్నారు.. మొబైల్ ఫోన్ పోయిన లేదా నేరస్తులు, సంఘవిద్రోహ శక్తుల చేతికి చిక్కిన ఎడల వారు మీయొక్క పోయిన మొబైల్ ఫోను ఉపయోగించి నేరాలు చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకని ప్రజలంతా మొబైల్ ఫోన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.. అనామకులు ఎవరైనా కనిపించి సెల్ ఫోన్ లో ఒక కాల్ చేసుకుంటామని అడిగిన వారికి మొబైల్ ఫోన్ ఇవ్వద్దని హెచ్చరించారు.. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ వాట్స్అప్ నెంబర్ 8099999977లకు ఫిర్యాదు చేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు కోరారు.