Cyclone effect on Tirumala: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుండి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కుండపోత వర్షం ముంచెత్తుతోంది. మైచౌంగ్ తుఫాన్ ప్రభావం నేడు, రేపు రాయలసీమలో జిల్లాలపై ఉండనుంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు నేపధ్యంలో పంట నీటి మునగగా, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మరోవైపు జిల్లాలోని వాగులు, వంకల్లో నీటి ప్రవాహం కొనసాగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో రహదారుల్లోనూ వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తుఫాన్ నేపధ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.  


ఏడుకొండల్లోనూ తుఫాన్ ప్రభావంతో అదే పరిస్థితి


తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా కూస్తున్న వర్షానికి ఏడుకొండలు తడిచి ముద్దైంది. పగలు - రాత్రి తేడా లేకుండా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దింతో తిరుమలకు వచ్చిన భక్తులకు ఓవైపు వర్షంతో పాటుగా మరోవైపు చలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వర్ష ప్రభావంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దర్శనానికి వెళ్లే సమయంలోనూ తిరిగి గదులకు వెళ్లే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు.


తుఫాన్ ప్రభావంతో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు..!


తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కాజ్‌వేల పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. కాజ్‌వేలపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి, అంజూరు, సూరమాల, కంచనపల్లి,గుండిపేడు,కాళంగి, రంగయ్యగుంట, ఆదవరం వంటి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో పంట‌పొలాల్లో నీరు చేరడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.