Cyclone Michaung: తిరుపతి: ఏపీలో రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు (Rains In Tirupati District) కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు. శనివారం మధ్యాహ్నం 1.40 గంటలకు రావాల్సిన న్యూఢిల్లీ, తిరుపతి వయా హైదరాబాద్ విమానం బెంగళూరుకు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మూడు గంటలు ఆలస్యంగా వచ్చి గాల్లో మూడు సార్లు చక్కర్లు కొట్టి బెంగళూరులో ల్యాండ్ చేశారు. మధ్యాహ్నం 3.45 నిమిషాలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి రావాల్సిన విమానం బెంగళూరుకు మళ్లించాల్సి వచ్చింది. విజయవాడ నుంచి తిరుపతికి సాయంత్రం 5.30కి రావాల్సిన ఇండిగో విమానం చెన్నైకి మళ్లించారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది సమాచారం ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శించడంతో తాము ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు.