ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ వాడని వారు ఉండరు.. కొందరు సోషల్ మీడియాను మంచి‌ పనులకు ఉపయోగిస్తే, మరి కొందరు చెడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ అమాయకులైన వారికి టార్గెట్ చేసుకుని మోసగిస్తున్నారు.. తాజాగా యువతి పేరుపై ఓ యువకుడు ఇన్ స్టాగ్రాంలో మరో యువకుడి వల వేసిన ఘటన తిరుపతి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. యువతి పేరుపై మెసేజులు చేస్తున్న అతను యువతి కాదని తెలుసుకున్న యువకుడు, ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చాడు.. దీంతో ఆ ఇద్దరూ యువకుల మధ్య ఫోన్ లో జరిగిన వాగ్వాదం కాస్తా గొడవకు దారి తీసింది.. ఒకరి వర్గం మరొక వర్గీయులపై దాడి చేసుకునే వరకూ దారి తీసింది.. తాతయ్య గుంట గంగమ్మ గుడికి దర్శనంకు విచ్చేసిన తమపై, తన పిల్లలపై ఓ వర్గం దాడి చేస్తున్నట్లు ఓ వీడియోను చిత్రీకరించిన ఓ మహిళా సోషల్ మీడియాలో‌ పోస్టు చేయడంతో విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.. అసలు ఏమైందంటే..?


తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఎస్సై జయ స్వాములు వెల్లడించిన వివరాల‌ మేరకూ.. తిరుపతి‌ నగరంలోని వేదాంతపురం అగ్రహారంకు చెందిన సోము అను వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో ఉప్పరపల్లికి చెందిన మహమద్ బాషా కు ఆన్లైన్ లో అమ్మాయి పేరుతో రెండు రోజుల ముందు మెసేజ్ వచ్చింది. అందుకు మహమద్ బాషా కూడా స్పందిస్తూ తిరిగి మెసేజ్ చేశాడు.. తరువాత సోము అమ్మాయి పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ లు పెడుతునట్లు తెలుసుకొని మహమద్ ఫోన్ చేసి సోముకు వార్నింగ్ ఇచ్చాడు. అసభ్య పదజాలంతో దూషించాడు.. ఐతే వీరిద్దరి మధ్య మాట మాట పెరిగి, సోము తన ఫ్రెండ్ నవీన్ కు విషయం చెప్పగా నవీన్, మహమద్ కు ఫోన్ చేసి హెచ్చరించాడు.


ఐతే ఇదే విషయంను మహమద్ తన ఫ్రెండ్ పసుపులేటి చందుకు విషయం చెప్పగా, చందు ఫోన్ లో నవీన్ తో గొడవ పెట్టుకొని నువ్వు ఎక్కడవున్నావో చెప్పు, నేను అక్కడకే వచ్చి మీ కథ తేల్చేస్తాను అని హెచ్చరించాడు.. చందు తుడ సర్కిల్ వద్ద అరటికాయల మండిలో వుంటానని, వచ్చి తేల్చుకో అని చెప్పడంతో బుధవారం రాత్రి సుమారు 10:30 గంటలకు సోము, నవీన్, అతని స్నేహితులు శశాంక్, భరత్, పవన్ కల్యాణ్, ప్రకాష్, డిల్లీ, మౌళి, చోటు, రోహిత్ లు కట్టెలు తీసుకొని ఆటోలో తుడ సర్కిల్ వద్దకు వచ్చారు.. అప్పటికే మహమద్, చందు అతని అన్న నాగార్జున అతని స్నేహితులు గంగాధర్, ప్రదీప్ కుమార్, పతిలు కర్రలతో సిద్దంగా ఉండి ఒకరికొకరు గొడవ పడారు.


అటు శశాంక్, భరత్ లు పీకే లేఔట్ లో ఉంటున్న వాళ్ల అమ్మ ఉషా రాణికి ఫోన్ చేసి విషయం చెప్పారు.. ఆమె తన కుమార్తె చందన ప్రియతో కలిసి తుడా సర్కిల్ వద్దకు వచ్చి సోము, నవీన్, శశాంక్, భరత్, పవన్ కల్యాణ్, ప్రకాష్, డిల్లీ, మౌళి, చోటు, రోహిత్ లతో కలిసి చందు వాళ్ళతో తిరిగి గొడవ పడ్డారు. ఈ గొడవలో‌ ఇరువర్గాల వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.. ఐతే ఉషారాణి తాను తన పిల్లలతో గంగమ్మ గుడి దర్శనానికి ఆటోలో వచ్చినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేసినట్లు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసి, తిరుపతి ఈస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా, సోము ‘ఆన్లైన్’ లో అమ్మాయి పేరుతో మహమద్ కు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టాడని తెలిసింది. ఆ మెసేజ్ కు మహమద్ కూడా రిప్లై ఇచ్చాడని, నిజం తెలుసుకొని ఇరు వర్గీయులు గొడవపడ్డారని పోలీసుల విచారణలో తెలిసింది. 


ఈ క్రమంలో ఉషారాణి తాను తన పిల్లలతో గంగమ్మ గుడికి దర్శనానికి ఆటోలో వచ్చినట్లు అందరిని నమ్మించి తప్పుదోవ పట్టించింది.. తాతయ్యగుంట గంగమ్మ గుడికి దర్శనార్థం వచ్చిన మహిళల, పిల్లలపై దాడి జరిగినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని, వ్యక్తిగత కారణాలతో గొడవ జరిగిందని, అవాస్తవాన్ని వాస్తవంగా నమ్మించేందుకు సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన మహిళపై కఠిన చర్యలు తీసుకుంటాంమని ఎస్సై‌ జయ స్వాములు తెలియజేశారు.