ఆడవారి వేషాలను మగవారు ధరించి మొక్కులు తీర్చుకొంటుండడం ఇక్కడ ఒక సంప్రదాయం. పుష్ 2 సినిమా ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ ఆడ వేషంలో కనిపించడం అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నుంచి ఆ సంప్రదాయం గురించి అందరూ ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న గంగమాంబ జాతరలో తాజాగా ఈ వేషధారణలు కనిపించాయి. ఇంకా శ్రీ ముత్తు మారెమ్మ ఆలయం ముందు అగ్నిగుండ ప్రవేశం కూడా జరిగింది. నిప్పులపై భక్తులు ప్రదక్షిణలు చేశారు. అశేషాజనవాహిని నడుమ అమ్మవారి విశ్వరూపం దర్శనం జరిగింది. ఈ జాతర జరుగుతున్న కుప్పం పురవీధుల్లో అమ్మవారి భక్తులు పోటెత్తారు.


చిత్తూరు జిల్లా కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర ప్రతి సంవత్సరం మే మాసంలో తమిళ ఉగాది పండుగ తరువాత జాతర జరిపే సాంప్రదాయంగా ఉంది. అంటే తమిళుల సంస్కృతి సాంప్రదాయాలకు ఇక్కడ పెద్దపీట ఉందని చెబుతుంటారు. అమ్మవారి జాతరలో ప్రధానంగా బొట్టు, చీరకట్టు, జడకట్టు, మగవారు ఆడవారిగాను, ఆడవారు మగవారి గాను వేషధారణ వేస్తూ ఉంటారు. అంతేకాక భక్తులు మాతంగి, బండ, బైరాగి, సున్నపు కుండలు, దొర, దొరసాని, రాజు, రాణి లాంటి ఎన్నో పౌరాణిక, వేష ధారణలు వేసి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుంటే జంబలకడిపంబ సినిమా తలపిస్తుంది.


తిరుపతి గంగమ్మ తల్లి కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి చెల్లెలని భక్తుల నమ్మకం.. అదేవిధంగా శ్రీ ముత్తు మారెమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజ, అభిషేకాలు, నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. అమ్మవారితో పాటు వందలాది భక్తులు సైతం అమ్మవారితో అగ్నిగుండ ప్రవేశం చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి అగ్నిగుండ ప్రవేశాన్ని తిలకించడానికి ఆలయం దగ్గరికి వేలాదిగా భక్తులు చేరుకొని అమ్మవారి అగ్ని ప్రవేశ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు.