Tirupathi: తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఎస్వీ యూజీ హాస్టల్ లో మంగళవారం తెల్లవారుజామున ఇరువురు విద్యార్థులపై ఓ విద్యార్థి దాడి చేశాడు. నందలూరు మహేష్ అనే మెడికల్ విద్యార్థిపై గణేష్ అనే మరో విద్యార్థి సర్జికల్ బ్లేడ్ తో దాడి చేసి గొంతుకోశాడు. తలపై క్రికెట్ స్టంప్ తో దాడి చేశాడు. పలమనేరుకు చెందిన ప్రవీణ్ తలపై కూడా క్రికెట్ స్టిక్ తో బలంగా కొట్టి గణేష్ పరారయ్యాడు.
గణేష్ దాడిలో మహేష్, ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతూ అక్కడే కుప్పకూలారు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో.. అవసరమైన శస్త్రచికిత్సలు చేశారు. ప్రస్తుతం మహేష్, ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రుయా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే.. దాడి జరిగిన ఎస్వీ మెడికల కాలేజీ యూజీ హాస్టల్ కు చేరుకున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కాంకూర్ కు చెందిన విద్యార్థి గణేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తిరుపతి వెస్ట్ సీఐ జయ నాయక్ నేతృత్వంలో ఈ కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.