Tirumala TTD Laddu Order Online: తిరుమల : లడ్డూ అనగానే తెలుగు వారికి నోరూరుతుంది. ఎందుకంటే మనకు గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీవారి లడ్డూ. అయితే తిరుపతి లడ్డూకు ఉన్న క్రేజ్‌ను కొందరు క్యాష్ చేసుకుందామని ప్రయత్నిస్తూ భక్తులను మోసం చేస్తున్నట్లు పోలీసులు, టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తిరుపతి లడ్డూను ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చునని ప్రచారం మొదలుపెట్టారు కేటుగాళ్లు. ఇది నిజమే అనుకుని భక్తులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తుండగా గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందించారు. ఆన్ లైన్‌లో తిరుపతి లడ్డూలు బుక్ చేసుకోవచ్చననే ప్రచారంలో నిజం లేదన్నారు. భక్తులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 


భక్తులు ఆ ప్రచారాన్ని నమ్మవద్దు.. టీటీడీ కీలక ప్రకటన 
టీటీడీ వెబ్ సైట్ ద్వారా లడ్డూలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని శ్రీవారి ఆలయ అధికారులు స్పష్టం చేశారు. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకానీ దర్శనంతో సంబంధం లేకుండా ఎవరు పడితే వారు తిరుపతి లడ్డూలను టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.


డిసెంబర్ 13న ప్రత్యేక దర్శనం కోటా టికెట్ల విడుదల..
డిసెంబర్ 16 నుండి 31వ తేదీల్లో తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో టిటిడి విడుదల చేయ‌నుంది. డిసెంబర్ 16 నుండి 31వ తేదీల్లో రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 13న  ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది టిటిడి. 


డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఆరోజు సాయంత్రం ధనుర్మాస కైంకర్యం నిర్వహిస్తారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం 5.30 నుండి 6 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిత్య కల్యాణోత్సవం జరుగుతుంది. ధనుర్మాస శుక్రవారాల్లో తెల్లవారు జామున ధనుర్మాస కైంకర్యం, మూలవర్లకు అభిషేకం, ఉదయం 9.15 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2వ తేదీ తెల్లవారుజాము నుండి భక్తులకు వైకుంఠ ద్వారా సర్వదర్శనం కల్పిస్తారు.