ఘరానా మోసాల్లో పురుషులకు ఏమాత్రం తీసుపోబోమని చాటుతున్నారు కొందరు మహిళలు. ఆ కోవకే చెందిన ఓ కిలాడి లేడీ ఘరానా మోసం శ్రీకాళహస్తిలో బయటపడింది. హైదరాబాదుకు చెందిన ఓ భక్తుడికి బస్సులో ఓ మహిళ పరిచయం అయ్యింది. అతనితో మాటా మాట కలిపింది. తానూ శ్రీకాళహస్తికి వెళ్తున్నానని సదరు మహిళతో ఆ వ్యక్తి చేప్పాడు. దీంతో తనకు శ్రీకాళహస్తిలో పరిచయం బాగా ఉందని, అక్కడ వసతికి, దర్శనానికి తాను సహాపడతానని నమ్మ బలికింది. దీంతో ఆమె మాయలో పడిన ఆ వ్యక్తి ఆమె చెప్పినట్లుగానే ఓ ప్రైవేటు హోటల్ లో ప్రక్క ప్రక్కనే గదులు తీసుకుని శ్రీకాళహస్తి స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. దర్శనం అనంతరం హోటల్ కు ఆ మహిళ ఇచ్చిన ప్రసాదం స్వీకరించిన యువకుడు మత్తులోకి జారుకున్నాడు. ఆ తరువాత ఆ మహిళ తన నిజ స్వరూపం బయట పెట్టింది. అసలు ఏమైందంటే...?
వివరాల్లోకి వెళ్ళితే. హైదరాబాదుకు చేందిన ఆయుర్వేద డాక్టర్ వెంకట లక్ష్మణ్ తన తల్లితో పాటుగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్ధం గత రెండు రోజుల క్రితం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో దిగిన వారు శ్రీకాళహస్తి బస్సు ఎక్కారు. అప్పటికే బస్సులో ఉన్న ఓ మహిళ ఆయుర్వేద డాక్టర్ వెంకట లక్ష్మణ్ తో అతని తల్లితో మాటలు కలిపింది.. ఆమె మాయ మాటల్లో పడిన ఆయుర్వేద డాక్టర్, అతని తల్లి శ్రీకాళహస్తికి వెళ్తున్నట్లు ఆ మహిళకు చెప్పారు. దీంతో తాను కూడా శ్రీకాళహస్తికి వెళ్తున్నానని చెప్పిన ఆ మహిళ, తనకు శ్రీకాళహస్తిలో పరిచయాలు ఉన్నాయని, తానే దర్శనం చేయిస్తానని నమ్మ బలికింది.
ఆ మహిళ మాయ మాటల్లో మునిగిపోయిన వారిద్దరూ ఆమె చెప్పినట్లే శ్రీకాళహస్తిలోని రామాస్ లాడ్జ్ లో పక్కపక్క గదుల్లో దిగారు. కిలాడి లేడీ ప్లాన్ ప్రకారం వారిద్దరిని శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనంకు తీసుకెళ్ళింది. దర్శనం పూర్తి అయిన తరువాత తిరిగి ముగ్గురు తాము దిగిన హోటల్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత మహిళ మత్తు మందు కలిపిన ప్రసాదాన్ని ఆయుర్వేద డాక్టర్ కు, అతని తల్లికి ఇచ్చింది. ప్రసాదమే కదా అని తిన్న కొద్దిసేపటికే ఇద్దరూ నెమ్మదిగా మత్తులోకి జారుకున్నారు.
దీంతో ఆమహిళ తన అసలు రూపం బయట పెట్టి, హైదరాబాదు నుండి వచ్చిన ఆయుర్వేద డాక్టర్, అతని తల్లి వద్ద గల నగదు, నగలు, మొబైల్, ఇతర విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించింది. మత్తు దిగాక గానీ తాను మహిళ చేతిలో నిలువునా మోసపోయామని వారు తెలుసుకున్నారు. ఆ మహిళ కోసం అంతా వెతికి సోమవారం ఉదయం శ్రీకాళహస్తి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. 75 గ్రాముల బంగారం, ఇరవై వేల నగదు, ఒక సెల్ ఫోన్ ను దోచుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు. ముందుగా బాధితుడు చెప్పిన లాడ్జ్ సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, దర్యాప్తు చేసిన అనంతరం కేసు నమోదు చేస్తామని చెప్పడంతో బాధితుడు తాను దిగిన హోటల్‌లోనే ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. కిలాడిలేడీని పట్టుకుని తన నగదు, నగలను తిరిగి అప్పగించాలని బాధితుడు కోరుతున్నాడు..