Chittoor Crime : వివాహేతర సంబంధాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. వివాహేతర సంబంధం హత్యకు దారితీసిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. తమ సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని భర్తను హత్య చేయించింది ఓ మహిళ. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ నెల 5వ తేదీన చిత్తూరు శివారు ప్రాంతంలోని సితమ్స్ కళాశాల వద్ద జరిగిన హత్య  కేసును ఐదు రోజుల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసమూర్తి తెలియజేశారు. చిత్తూరు నగరంలోని‌ స్వామి‌‌మేస్త్రీ వీధిలో‌ వడివేలు తన భార్య సెల్వరాణితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆటో‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు వడివేలు. కుటుంబ అవసరాల కోసం వడివేలు తన భార్య సెల్వరాణిని అదే‌ వీధిలో‌ని ఓ దుకాణంలో పనికి పెట్టాడు. అక్కడే మరో‌ దుకాణంలో పనిచేసే వినయ్ తో సెల్వరాణికి‌ పరిచయం ఏర్పడింది. వీరి‌ పరిచయం వివాహేత సంబంధానికి దారి తీసింది. తనకు ఇంకా వివాహం కాలేదంటూ సెల్వరాణి, వినయ్ తో‌ కలిసి భర్తకు తెలియకుండా ప్రియుడితో కలిసి టూర్ లకు వెళ్లేది. 


పథకం ప్రకారం హత్య 


ఓ‌ రోజు వినయ్, సెల్వరాణిలు కలిసి‌ ఉండడాన్ని వడివేలు స్నేహితుడు చూసి వడివేలుకు విషయం చెప్పాడు. దీంతో విషయం తెలుసుకున్న వడివేలు ఇంటికి వచ్చిన సెల్వరాణిని నిలదీశాడు. అయితే తమ విషయం‌ ఇంట్లో తెలిసిందని వినయ్ కు సెల్వరాణి చెప్పడంతో‌, ఇక ఆలస్యం చేస్తే తన ప్రియురాలు తనకు దక్కదని భావించిన వినయ్ వివాహం చేసుకుందామని సెల్వరాణికి చెప్పాడు. తనకు వడివేలుతో వివాహం అయిన విషయాన్ని బయట పెట్టిన సెల్వరాణి తమ వివాహేతర సంబంధం భర్త అడ్డువస్తున్నారని, ఎలాగైన తన భర్తను హత మార్చాలని ప్రియుడితో కలిసి పక్కా‌ ప్లాన్ వేసింది. ప్రియురాలి పథకం ప్రకారం వినయ్ తన స్నేహితుడు నిరంజన్ ను కలిసి తమ ప్రేమ విషయం చెప్పి, సెల్వరాణి భర్తను హత మార్చేందుకు సహాయం చేయాలని కోరాడు. దీంతో నిరంజన్ తనకు తెలిసిన కిరాయి హంతకుడు కిషోర్ ను పరిచయం చేశాడు. వడివేలును హత్య చేసేందుకు కిరాయి మాట్లాడి ముందస్తుగా కొంత నగదును కిషోర్ కు ఇచ్చాడు వినయ్. దీంతో వడివేలును హత్య చేసేందుకు రెక్కి నిర్వహించి పక్కా స్కేచ్ వేశాడు. 


వడివేలు అన్న కూడా మర్డర్ 


అంతే కాకుండా ఆన్లైన్ లో హత్య చేసేందుకు అవసరం అయ్యే కత్తిని కొనుగోలు చేశాడు వినయ్. ఈ‌నెల ఐదో తేదీ రాత్రి వడివేలుకు ఫూటుగా మద్యం తాగించారు.  వడివేలు మద్యం మత్తులో ఉన్న సమయంలో మద్యం సీసాతో తలపై కొట్టి, తర్వాత కత్తితో వడివేలు గొంతు కోసి కిరాతకంగా హత్య చేసి పరార్ అయ్యారు. ఆరో తేదీన భర్త శవం ముందు ఏమీ తెలియనట్టుగా సెల్వరాణి బోరున విలపించి నాటకం ఆడింది. గత ఏడాది వడివేలు అన్నను సైతం ఇదే‌ విధంగా దుండగులు హత్య చేసారని,  ఇప్పడు తన రెండో కుమారుడిని‌ సైతం హత్య చేసి తనకు కడుపు‌కోత మిగిల్చారని వడివేలు తల్లి‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వడివేలు హత్య జరిగిన ప్రదేశంలో క్లూస్ ను సేకరించారు. వాటి ఆధారంగా వడివేలు సెల్ ఫోన్ కు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు సాగించారు. విషయం తెలుసుకున్న సెల్వరాణి ప్రియుడు‌ వినయ్ తో‌ కలిసి పరార్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో ముద్దాయిలైన సెల్వరాణి, వినయ్, కిషోర్, నిరంజన్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.