చదువుకునే వయస్సులో ఇతర ఆలోచనలపై దృష్టి పెట్టి సమస్యల వలయంలో పడుతున్నారు.. పిల్లలు. చదువుకుని మంచి పేరు తెస్తారని భావిస్తే తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తున్నారు.. తెలిసి తెలియని వయస్సులో చేసే తప్పులే పిల్లల బంగారు భవిష్యత్తుకు దూరం చేస్తుంది.. తాజాగా చంద్రగిరికి సమీపంలో సాంప్రదాయ పాఠశాల్లో అర్ధరాత్రి గోడ దూకి పరార్ అయ్యిన నలుగురు విద్యార్ధినుల మిస్సింగ్ కేసు సుఖాంతం అయ్యింది.. విద్యార్ధినులను సురక్షితంగా తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తల్లిదండ్రులకు అప్పగించారు. మిస్సింగ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్ళితే.. చంద్రగిరికి సమీపంలోని తొండవాడలో శ్రీ కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడే సాంప్రదాయ పాఠశాల్లో (బాలికలకు మాత్రమే) నలుగురు విద్యా్ర్థినుల అదృశ్యం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.. ఈనెల 8వ తేదీ ఆదివారం రాత్రి నలుగురు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కాంపౌండ్ వాల్ దూకి పరార్ అయ్యారు.. అర్ధ రాత్రి గోడ దూకి పరార్ అవుతున్న విద్యార్థినులను గమనించిన స్థానికుడు వెంటనే పాఠశాల సెక్యూరిటీకి తెలియజేశాడు. దీంతో విద్యార్ధినుల కోసం పాఠశాల సెక్యూరిటీ, యాజమాన్యం గాలించాయి.. కానీ విద్యార్ధినుల ఆచూకీ ఎంతకీ తెలియక పోవడంతో పాఠశాల కో-ఆర్డినేటర్ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు..
అయితే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలతో బాలికల ఆచూకీ కోసం ఏపీతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో గాలించారు. కానీ ఆ నలుగురు బాలికల ఆచూకీ లభ్యం కాకపోయేసరికి సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలలో పోలీసులు బాలికలను వారి ఫోటోలతో పాటు ప్రచురించి ఆచూకీ కోసం ప్రయత్నించారు.
సోషల్ మీడియాలో బాలికల ఫోటోలను చూసిన ముంబయికి చెందిన ఓ వ్యక్తి నలుగురు బాలికలను చేరదీసి, వారిని తీసుకొని విజయవాడ వైపు వస్తున్నట్లు అతనే పోలీసులకు సమాచారం అందించాడు. అప్పటికే కొల్హాపూర్లో విచారణ జరుపుతున్న ఒక పోలీసు బృందం తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు పూణె చేరుకుని పూణె పోలీసుల నుంచి బాలికలను స్వాధీనం చేసుకొని సురక్షితంగా శుక్రవారం తిరుపతికి తీసుకొచ్చారు. దీంతో ఆ నలుగురు బాలికల ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి చేరుకున్న బాలికలను చంద్రగిరి తాహసీల్దార్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.
బాలికలు ఎందుకు పరార్ అయ్యారంటే..??
సాంప్రదాయ పాఠశాలలో విశాఖపట్నానికి చెందిన రవి విద్యాలక్ష్మి వర్షిని(18), కడపకు చెందిన వెల్ల ప్రణతి(18), విజయవాడకు చెందిన జయంతి స్రవంతి(18), విజయనగరానికి చెందిన అక్కినేని శ్రీవల్లి (19)లు డిగ్రీ మొదటి సంవత్సరం చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు.. కళాశాల అనంతరం సాంప్రదాయ విద్యాలైన వేదాలు ఉపనిషత్తులు సంగీతం నేర్చుకుంటూ సంప్రదాయ పాఠశాలలో హాస్టల్ లో బస చేస్తున్నారు.. అయితే తమతో పాటుగా ఉంటున్న మరో ఇద్దరు యువతులు రెండు సెల్ ఫోన్లను యాజమాన్యానికి తెలియకుండా వారి వద్ద ఉంచుకుని వాటి ద్వారా ఫోన్లు చేసి తల్లిదండ్రులతో పాటు మరికొందరుతో మాట్లాడి, ఆ తరువాత వాటిని పాఠశాలలోని యథాస్థానంలో ఉంచేవారు.. ఈ విషయం గుర్తించిన పాఠశాల యాజమాన్యం ఆరుగురు విద్యార్థులను బాధ్యులుగా చేస్తూ వారికి డిగ్రీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన హాల్ టికెట్లను ఇవ్వబోమని మందలించారు.. దీంతో భయపడిన నలుగురు విద్యార్థులు ఈ విషయం తమ తల్లిదండ్రులకు తెలిస్తే, తమను శిక్షిస్తారనే భయంతో గోడదూకి పారి పోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తిరుపతి నుండి ముంబయికి ఎలా వెళ్ళారంటే?
ఆ నలుగురు విద్యార్ధినులు తిరుపతి నుంచి ట్రైన్ ద్వారా కొల్హాపూర్ చేరుకుని, అక్కడి నుంచి ముంబయికి చేరుకున్నారు. ముంబయిలోని ఓ పార్కులో వీరు ఉండగా విజయవాడకు చెందిన మోపిదేవి శ్రీనివాస్, మర్చంట్ నేవీ ఉద్యోగి నలుగురిని గమనించి వారిని చేరదీసి, వారికి రక్షణ కల్పించి వారిని సురక్షితంగా పోలీసులకు అప్పగించడంతో బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం అయ్యినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి అన్నారు..
హాస్టల్స్, విద్యాలయ యాజమాన్యంతో ఇతరత్రా సమస్యలు ఉంటే తల్లిదండ్రులకు తెలియజేసి పరిష్కరించుకోవాలే తప్ప ఈ విధంగా పారిపోవడం ఏమాత్రం సురక్షితం కాదని ఎస్పీ సూచించారు.