Tirumala News : తిరుమలలో స్లాట్ విధానం ద్వారా సామాన్య భక్తులకు త్వరలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల సలహాలు, సూచనలు ఈవో ధర్మారెడ్డి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 12వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో రావడం ద్వారా స్లాట్ విధానాన్ని టీటీడీ రద్దు చేసిందన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. టీటీడీలో సమయాన్ని బట్టి, రద్దీ బట్టీ సేవలను రద్దు చేసే వ్యవస్థ ఉందని, అందుకే వివిధ పర్వదినాల్లో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తు్న్నామని ఈవో తెలిపారు. 


వృద్ధులకు రోజూ ఆన్లైన్ స్లాట్ విధానం 


సహస్ర కలశాభిషేకం, విశేష పూజ, వసంతోత్సవాన్ని ఉత్సవర్లను అరుగుదల నుంచి కాపాడేందుకు అర్చకులు, జియ్యంగార్ల ఆదేశాల మేరకు కొన్ని సార్లు సేవలు రద్దు చేశామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.  అష్టదళ, తిరుప్పావడ సేవలు జూన్ 30వ తేదీ వరకూ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్జిత సేవల సమయంలో మరింత మంది భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వయోవృద్ధులకు సంబంధించిన విషయాలపై కొందరు భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని ఈవో తెలిపారు. వయోవృద్ధులకు ప్రతి రోజు ఆన్లైన్ స్లాట్ విధానం ద్వారా వెయ్యి మందికి దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు. చంటి బిడ్డల తల్లిదండ్రులకు, ఎన్.ఆర్.ఐ దర్శనాలు కూడా ప్రస్తుతం తిరుమలలో యథావిధిగా కొనసాగుతుందని తెలియజేశారు. 


హుండీ ఆదాయం రూ.127 కోట్లు 


ఏప్రిల్ నెలలో శ్రీవారిని ఇరవై లక్షల అరవై నాలుగు వేల మంది దర్శనం చేసుకున్నారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హుండీ ద్వారా రూ.127 కోట్లు ఆదాయం రాగా, హుండీ కానుకులు నుంచి రూ.4.41 కోట్ల ఆదాయం లభించిందన్నారు. 99.07 లక్షల శ్రీవారి లడ్డూలు విక్రయించారని ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. పరకామణిలో ఓ సిబ్బంది నగదు తీసుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది పట్టుకుని రిమాండ్ చేశారని, పరకామణిని కఠినంగా పరిశీలిస్తున్నామన్నారు. స్వామి వారి సొత్తును దొంగలిస్తే కచ్చితంగా పట్టుబడుతారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందన్నారు.