అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలోనూ వారి సంస్కృతి, సాంప్రదాయాలను మరువలేదు. శాస్త్ర సాంకేతిక రంగం కొత్తపుంతలు తొక్కుతున్నా వారి ఆచార,వ్యవహారాలను వదిలిపెట్టలేదు. అమెరికా అల్లుడు, ఆస్ట్రేలియా అమ్మాయి అని చెప్పుకునే నేటి రోజుల్లో కూడా వారి కట్టుబాట్లను విడవలేదు. ముందుతరం ఇచ్చిన సంస్కృతి సాంప్రదాయాలే వారి ఆస్తిగా, వాటిని నిలుపుకోవడమే తమ కర్తవ్యంగా వివాహాలకు సిద్దపడ్డారు. వారి సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూనే చట్టాన్ని కూడా గౌరవిస్తూ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. గ్రామాన్నే పెళ్ళి పందిరి చేసి, వీధులను పెళ్ళి మండపాలుగా మార్చి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 సామూహిక వివాహాలు ఏకకాలంలో నిర్వహించి అధికారులే అబ్బురపడేలా పెళ్ళి తంతు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఉన్న నువ్వలరేవు. వందల సంవత్సరాల క్రితం ఒడిశా నుంచి నువ్వలరేవుకు వలస వచ్చిన కేవిటీ కులస్తులు నివసించే గ్రామం. అప్పటి నుంచి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. వీరి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం వీరు మూడేళ్లకోసారి ఆ గ్రామంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తుంటారు. ఆ ముహూర్తంలో ఆ గ్రామంలో ఒకరిని ఒకరు ఇష్టపడి, ఇరు కుటుంబాలు అంగీకరించి, పెళ్ళికి సిద్దంగా ఉన్న యువతీయువకులకు పెళ్ళి చేస్తారు.
మూడు సంవత్సరాలకొకసారి వారి కులపెద్దలు నిర్ణయించే ముహూర్తానికి తప్ప మరెప్పుడూ పెళ్ళి అనే మాట ఈ గ్రామంలో వినిపించదు. అంతేకాదు బయట గ్రామాల అమ్మాయిలను గాని అబ్బాయిలను గాని వీరు పెళ్ళికి అంగీకరించరు. ఆ గ్రామంలో ఉండే వారు ఆ గ్రామంలో వాళ్ళని మాత్రమే పెళ్ళిచేసుకోవాలి. అదీ కూడా వారి ఆచార వ్యవహారాలు, వారి సాంప్రదాయం ప్రకారమే అంతా జరగాలి. సాధారణ పెళ్ళిళ్ళతో పోలిస్తే వీరి సాంప్రదాయ వివాహాలు కొత్తగా అనిపిస్తాయి. ఒకే ముహూర్తానికి పందిరిరాటలను ప్రతిష్టిస్తారు. ఆ తరవాత ఇంటి ముందు పెళ్లి మండపాన్ని నిర్మించుకుంటారు.
పెళ్లి రోజు వధూవరులతోపాటు వారి బంధువులు, సన్నిహితులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ అడుతారు. ఆ తరువాత గ్రామ శివారులో గల చెరువుకు వెళ్ళి సామూహిక స్నానాలు ఆచరించి అక్కడ నుంచి బిందెలతో నీళ్లు తీసుకువస్తారు. ఇక్కడా మరో ఆచారం. వరుడి పక్కనే వధువు చెల్లెలు, వధువు పక్కనే వరుడి సోదరుడిని కూర్చోబెట్టి స్నానాలు చేయిస్తారు. వారు లేకుంటే ఆ వరసయ్యేవారిని కూర్చోబెట్టి ఆచారాలను అమలు చేస్తారు.
బంధువులు ఇచ్చే కరెన్సీ నోట్లను ఒక మాలగా అల్లి వరుడి మెడలో వేస్తారు. నూతన వస్త్రాలు, కళ్లజోడుతో వరుడ్ని అలంకరిస్తారు. తంబాకు, పోకచెక్కలు, ఇతర సంప్రదాయ పొడులు ఉంచిన పళ్లెం పట్టుకుని గొడుగు నీడలో వరుడ్ని ఇంటి నుంచి బయటకు తీసుకు వస్తారు. ఎదురు పడిన బంధువులు, పెద్దల చేతిలో తాంబూలం ఉంచి కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుని పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు.
పెళ్లిళ్లన్నీ ఒకే ముహూర్తానికి చేసినప్పటికీ ఒకే వేదిక మీద జరగవు. ఎవరి పెళ్లి వారి ఇంటముంగిటే జరుగుతుంది. మాంగల్య ధారణ విషయంలో కూడా వీరి సాంప్రదాయం భిన్నంగా ఉంటుంది. సాధారణ పెళ్ళిళ్ళలో వరుడు మాత్రమే వధువుకు తాళి కడతాడు. మరి వీరి సాంప్రదాయం ప్రకారం మాత్రం వరుడు, వధువుకు తాళి కట్టడంతోపాటు ధాన్యపు గింజ ఆకారంలో ఉండే ధాన్యరచన అనే ఆభరణం వంటి తాళిని వధువు కూడా వరుడికి కడుతుంది. ఈ ధాన్యరచనను పెళ్ళయిన మూడు నెలలలోపు మరల ఆ ఆభరాణాన్ని కరిగించి వధువు మంగళ సూత్రాల్లో దాన్ని కలిపి ధరిస్తారు. పెళ్ళయిన రోజునే తొలిరాత్రి జరుపుతారు.
నువ్వలరేవు గ్రామానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. వీరంతా కేవిటి వర్గానికి చెందినవారు. మత్స్యకారుల్లో ఒక తెగ. అప్పట్లో ఒడిశాలోని సుమండి, సున్నాపురం, సుర్ణ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చారు. అప్పటి నుంచే ఈ పెళ్లిళ్ల ఆచారం అమలవుతోంది. మగవాళ్లు వేటకు వెళ్తారు. మహిళలకు చేపలు విక్రయిస్తారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏదో వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తారు. సుమారు
పది వేలు జనాభా ఉండే నువ్వలరేవు మేజరు పంచాయతీ లక్ష్మీదేవిపేటగా పేరొందినా నువ్వలరేవుగానే ప్రసిద్ధి. ఆ
ఊరందరిదీ ఒకేమాట. ఒకే బాట. నలుగురైదుగురు పెద్దలు కూర్చొని నిర్ణయించిన మాటకు ఎదురుండదు. అందరి ఆమోదం ఉండేలాగానే నిర్ణయం తీసుకుంటారు. గ్రామదేవత తులసి బృందావతి. తులసిమాతగా పూజిస్తారు. శ్రీరాముడు వారి ఇలవేల్పు. శ్రీరామనవమి వచ్చిందంటే సంబరాలు అంబరాన్నంటుతాయి.
ఆ ఊర్లో బైనపల్లి, బెహర, మువ్వల అనే మూడే ఇంటిపేర్ల వారుంటారు. ఒక ఇంటి పేరవారు మిగిలిన రెండు ఇంటిపేర్ల పిల్లల్లో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అన్నాచెల్లెల వరస కలిస్తే నిషిద్ధం. మూడేళ్లకోసారి పెళ్లిళ్లు నిర్వహిస్తారు. ఊళ్లో ఏ అమ్మాయినైనా అబ్బాయి ఇష్టపడితే తల్లిదండ్రులతో చెబుతారు. తరువాత పెద్దల ముందు ఉంచుతారు. వరసలు అన్నీ కలిసి వారు అంగీకారం తెలిపితే నిశ్చయం అయినట్లే. ఊళ్లో చాలా మంది డిగ్రీలు చేసినవారు ఉన్నారు. అమ్మాయిలు కనీసం పదోతరగతి వరకు పూర్తి చేశారు. బి.టెక్‌లు చేసినవాళ్లు ఊళ్లొ 15 మంది వరకు ఉన్నారు. డిప్లొమోలు చేసి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నా ఈ ఊరి అమ్మాయినే వారు పెళ్లి చేసుకుంటారు.
ఇక్కడ కులపెద్దలు 'బెహరా'లదే కీలక పాత్ర. బెహరాల నేతృత్వంలో గ్రామస్థులు సమావేశం నిర్వహిస్తారు. ఆ రోజు సామూహిక వివాహాలకు ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. గ్రామంలో చాటింపు వేయించి వివాహాలకు సిద్ధంగా ఉన్నవారి పేర్లు నమోదు చేయిస్తారు. సామూహిక విందుకు వధూవరుల కుటుంబసభ్యులు కొంత మొత్తాన్ని బెహరాలకు చెల్లిస్తారు. ఇంటివద్ద పెళ్లి ఖర్చులు మాత్రం ఇరు కుటుంబాలే పెట్టుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల పాటు గ్రామంలో సందడి వాతావరణం కనిపిస్తుంది. వేదమంత్రాలు, సన్నాయిమేళాల వాయిద్యాలే వినిపిస్తాయి. విద్యుద్దీప కాంతులతో వీధులు కళకళాడుతుంటాయి.