అలిపిరి నడక మార్గంలో గత కొద్ది రోజులుగా చిరుత పులుల సంచారం అధికంగా ఉన్న క్రమంలో అలిపిరి నడక మార్గంలో 300 కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి వైల్డ్ లైఫ్ డీఏఫ్ఓ సతీష్ రెడ్డి తెలియజేశారు. గురువారం (ఆగస్టు 17) తిరుపతిలోని ఎస్వీ జూపార్క్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అనేక విషయాలను వెల్లడించారు. చిరుత పులుల ట్రాప్ లను అమర్చిన ప్రదేశాలకు ప్రతిరోజు వెళ్లి అందులో వచ్చిన ఇమేజెస్ ను సేకరించి వాటిని అనాలసిస్ చేసి సాయంత్రానికి వాటి ఆధారంగా ట్రాప్ ను అమర్చుతున్నట్లు తెలిపారు.  


బాలికపై చిరుత దాడి చేసిన తర్వాత ఈ నెల 13వ తేదీ సాయంత్రం ఒక చిరుత పులి సంచరిస్తున్నట్టు గుర్తించామని, మరుసటి రోజు 14 వ తేదీన ఒక చిరుతను బంధించడం జరిగిందన్నారు. ఆ చిరుతను జూకి తరలించి, క్వారంటైన్ పెట్టి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 15 తేదీ కూడా మరొక చిరుత పులి ఆనవాళ్ళు గుర్తించడం జరిగిందని, ఆ చిరుత సంచరించే ప్రదేశాల్లో ట్రాప్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే, ఈ రోజు ఉదయం మరొక చిరుతను బంధించామన్నారు. ఈ చిరుతను కూడా జూపార్క్ కు తరలించామని చెప్పారు. ఇప్పటికి కూడా నడక మార్గానికి చుట్టు పక్కల ప్రాంతాల్లో చిరుత సంచారం కొనసాగుతూనే ఉంటుందని, అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటూ భక్తుల్ని అప్రమత్తంగా చేస్తున్నట్లు డిఏఫ్ఓ సతీష్ రెడ్డి వెల్లడించారు.


అందుకే చిరుతలు వస్తున్నాయ్!


నడక మార్గాల్లో, ఘాట్ రోడ్డులో వెళ్ళే సమయాల్లో చాలా మంది భక్తులు వన్యప్రాణులకు ఆహారం అందిస్తున్నారని, ఈ కారణంగానే వన్యప్రాణులను వేటాడేందుకు మృగాలు ఆ ప్రాంతాలకు వస్తున్నాయని తెలిపారు. అయితే, ఇప్పటికే వన్యప్రాణులు ఏ ప్రాంతాల్లో అధికంగా ఉంటున్నాయనే దానిపై పూర్తి స్ధాయిలో ఓ నిర్ధారణకు రావడం జరిగిందని, బాలికపై దాడి చేసిన తర్వాత ఆ ప్రాంతాల్లో ట్రాప్స్ ను ఏర్పాటు చేసి రెండు చిరుతలను బంధించడం జరిగిందని, ఈ రెండు చిరుతల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపడం జరిగిందని చెప్పారు. రిపోర్టుల ఆధారంగా ఏ చిరుత బాలిపై దాడి చేసిందో గుర్తించగలుగుతామని, అప్పుడు ఆ చిరుతను జూపార్క్ లోనే ఉంచాలా లేక అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలా అనేది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  


ప్రస్తుతం అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఇస్తున్న కర్రలపై భక్తుల నుండి విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయని, అయితే ఊతకర్రలు తీసుకెళ్ళడం ద్వారా వన్యమృగాలకు వాటి కంటే ఎత్తుగా కనిపించే అవకాశం‌ ఉంటుందని, అదే విధంగా ఆ ఊతకర్రల నుండి వచ్చే శబ్ధం ద్వారా వన్యమృగాలు భయపడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇవ్వాలనే ప్రతిపాదనను టీటీడీకి తీసుకెళ్లడం జరిగిందన్నారు.


లక్షితపై దాడి చేసింది చిరుత, ఎలుగుబంటా?


అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న ఆరేళ్ళ బాలిక లక్షితపై దాడి చేసింది చిరుత పులి గానీ లేక  ఎలుగుబంటి గానీ చేసుండవచ్చు. అందుకే రెండు రకాలు గానూ అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. చిరుత పులుల సంచారం ఉంటే ట్రాప్ చేస్తామని, నడక మార్గాలకు సమీపంగా ఎలుగుబంటి సంచారం ఉన్నట్లైతే ట్ర్యాంకులేజింగ్ టీం ద్వారా వాటిని వలల ద్వారా బంధించేందుకు, ఏ క్షణంలోనైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వాస్తవానికి చిరుత పులులు మ్యాన్ ఈటర్ బిహేవియర్ ఉండే అవకాశం ఉండదని చెప్పారు. చిన్న పాప కాబట్టి చిన్న జంతువుగా భావించి ఒంటరిగా ఉన్న పాపపై దాడి చేసిందనే తాము నిర్ధారణకు వచ్చామని చెప్పారు. అయితే అలిపిరి నడక మార్గంలో నాలుగు వందల ట్రాప్ కెమెరాలను అమర్చి, శ్రీవారి మెట్టు మార్గంలో 100 ట్రాప్ కెమెరాలను అమర్చుతామని చెప్పారు. వన్యమృగాల సంచారం తగ్గే వరకూ భక్తులంతా అప్రమత్తంగా ఉండాలని తిరుపతి డీఏఫ్ఓ సతీష్ రెడ్డి కోరారు.