YSRCP MP Sanjeev Kumar Visits Tirumala: తిరుమల : కలియుగ దైవం శ్రీనివాసుడి సన్నిధిలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అన్య మతానికి సంబంధించిన ప్రచారం చేయడం గానీ, పార్టీ గుర్తులు, పోస్టర్లు బహిరంగంగా ప్రదర్శించడం తిరుమలలో నిషిద్ధం కానీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ తిరుమలలో సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్ ప్రదర్శించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తిరుమలలో నిఘా వైఫల్యమంటూ హాట్ టాపిక్ అయింది.
అసలేం జరిగిందంటే..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న మొబైల్ తో వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ తిరుమలకు వచ్చారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న తరువాత తిరుమల ఆలయ వెలుపల వచ్చిన సమయంలో అధికార పార్టీ ఎంపీ సంజీవ కుమార్ ఏపీ సీఎం జగన్ స్టిక్కర్ ఉన్న తన సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని తిరగడం హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా తిరుమలకు మద్యం, మాంసంతో పాటు పార్టీల కండువాలు, జెండాలు, రాజకీయ పార్టీల నేతల స్టిక్కర్లు, ప్రచార సామాగ్రి, అన్య మతాల చిహ్నాలు పూర్తిగా నిషేధమని తెలిసిందే. అలిపిరి టోల్ గేట్ దగ్గరే భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుంటారు. అయితే అప్పుడప్పుడు నిషేధిత వస్తువులు తిరుమలకు రావడం, వివాదం చెలరేగడం గత కొంత కాలంగా పరిపాటిగా మారింది. ఇటీవల ఏకంగా ఓ వాహనంపై ఛత్రపతి శివాజీ స్టిక్కర్ ను తొలగించడంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. చివరికి భద్రతా సిబ్బంది తెలియక పొరపాటుగా తొలగించారని టిటిడి ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు.
అలాంటిది ఓ వైసీపీ ఎంపీ సీఎం జగన్ స్టిక్కర్ ఉన్న సెల్ ఫోన్ తో శ్రీవారి ఆలయం ముందు అందరికి కనిపించేలా తిరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు సామాన్యులకేనా, అధికార పార్టీ నేతలకు వర్తించవా అంటూ సామాన్యులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీ నేతలు వైసీపీ లోగోలు, సీఎం జగన్ ఫొటోలు ప్రదర్శిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read: TTD News: చిరుత దాడి: అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు, భక్తులు ఈ సూచనలు పాటించాల్సిందే - ఈవో
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివ నాయుడు,కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Also Read: Tirumala: చిరుతపులి దాడి ఘటన - బిడ్డకు ఏమైనా జరిగితే ప్రాణాలు వదిలేవాళ్లం! కౌశిక్ తల్లితండ్రులు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial