అలిపిరి నడక మార్గంలో ఐదేళ్ళ బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేసిన వేళ టీటీడీ అటవీ శాఖా అధికారులు అప్రమత్తం అయ్యారు. గాలిగోపురం నుండి ఏడో మైలు వరకూ చిరుత సంచారం అధికంగా జరిగే ప్రాంతాల్లో కెమెరా ట్రాప్స్ నిఘాతో పాటు రెండు ప్రదేశాల్లో చిరుత పులిని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సాయంత్రం ఆరు నుండి రాత్రి పదకొండు వరకు నడిచే భక్తులను గుంపులు గుంపులు ఏడోమైలు నుండి గాలిగోపురం వరకూ పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నడక మార్గం గుండా తిరుమలకు నడక సాగించే భక్తులు భయపడాల్సిన అవసరం లేదని టీటీడీ డీఏఫ్ఓ శ్రీనివాస్ ఏబీపీ దేశంతో అన్నారు.
చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని శుక్రవారం (జూన్ 23) తితిదే ఈవో ధర్మారెడ్డి మరోసారి పరిశీలించారు. అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసింది పిల్ల చిరుత కాబట్టి, బాలుడికి ప్రాణాపాయం తప్పిందని అన్నారు. పిల్లాడ్ని చిరుత నోట కరుచుకొన్న వెంటనే భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేసి దాన్ని బెదురుపాటుకు గురి చేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్లి పోయిందని అన్నారు. అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోందని టీటీడీ అధికారులు చెప్పారు.
200 మంది భక్తులు ఒక బృందంగా..
రోజూ రాత్రి 7 గంటల తర్వాత అలిపిరి మెట్ల మార్గంలో గాలిగోపురం నుంచి 200 మంది భక్తులను ఒక సమూహంగా ఏర్పరచి.. గుంపుగా పంపేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డు కూడా వారి వెంట ఉంటారని చెప్పారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పారు. చిన్న పిల్లలు చివరల ఉండకుండా పెద్దవారి మధ్యన ఉండేలా చూసుకుకోవాలని సూచించారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం కెమెరా ట్రాప్స్ కూడా సిద్ధం చేశారని చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి నడక మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారని ఈవో చెప్పారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఘాట్‌రోడ్లలో బైక్ లపై వెళ్లే వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
నిన్న (జూన్ 22) రాత్రి బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత
తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత పులి హల్ చల్ చేసింది. ఏడవ మైలు వద్ద చిరుత ఐదేళ్ళ బాలుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. బాలుడితో పాటుగా ఉన్న బాలుడి తాత, భక్తులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంబడించడంతో దాదాపు 150 మీటర్ల దూరంలో చిరుత బాలుడిని వదిలి వెళ్ళింది. ఐతే అటవీ ప్రాంతంలో ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన అటవీ శాఖ ఉద్యోగి బాలుడిని సురక్షితంగా అటవీ ప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చి టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి.
సమాచారం తెలుసుకున్న టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సంఘటన స్ధలానికి చేరుకుని బాలుడిని హుటాహుటిన 108 వాహనంలో తిరుపతిలోని చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు చిరుత దాడి ఘటనలో గాయపడ్డ బాలుడిని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.