TTD News: తిరుమల గుబ్బా చౌల్ట్రీలో కుటుంబ వివాదం నడుస్తోంది. ఆర్ ఆర్ నాథన్ ఆధ్వర్యంలో గుబ్బా చౌల్ట్రీ ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం ఇది కరెప్షన్ కు అడ్డాగా మారిందని ఆర్ ఆర్ నాథన్ చిన్న కొడుకు అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్య వైశ్యుల కోసం తిరుమలలో గుబ్బా, చిత్తూరులో చారిటీ సత్రాలు ఉన్నాయని తెలిపారు. గుబ్బా చౌల్ట్రీ ఫామిలీ ప్రాపర్టీ కాదు... దాతల సహకారంతో కట్టిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తన అన్నలైన జీవన్ కుమార్, అశ్విన్ కుమార్ లు ఫామిలీ ప్రాపెర్టీగా వినియోగిస్తున్నారని వివరించారు. తన తండ్రి ఆర్ఆర్ నాథన్ బ్రతికి ఉన్న సమయంలో రూ. 300 లకే రూములు ఇచ్చే వాళ్ళమని చెప్పారు. కానీ ఇప్పుడు నాన్ ఏసీ రూములు రూ. 1500, ఏసీ రూములు రూ. 2000 వేలుగా మార్చేశారన్నారు. ఇది ధర్మసత్రం అని.. ఇందులో ధర్మ కార్యక్రమాలు మాత్రానే సాగాలని చెప్పారు. అక్రమాలకు తావు ఇవ్వకుండా ఉండాలని అన్నారు. ఆర్య వైశ్యుల నుంచి గుబ్బ సత్రాన్ని దూరం చేస్తున్నారని వాపోయారు.
ఇతర కులాల వారికీ అధిక రేట్లకు రూములను విక్రయిస్తున్నారని అరుణ్ కుమార్ తెలిపారు. గతంలో 70 రూములు ఆర్య వైశ్యులకు, దాతలకు ఇచ్చేవాళ్లని... కానీ ఇప్పుడు 20 రూములు కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఇతర కులాల వారు సత్రానికి వస్తే.. ఫేక్ డొనేషన్ స్లిప్ ఇస్తున్నారని వెల్లడించారు. దాతకు రూ. 500 కు రూము కేటాయించాలని 20 రూములు ఇస్తుంటే... మిగిలిన రూములు రూ 2 వేలకు విక్రయిస్తున్నారని వివరిస్తున్నారు. ప్రస్తుతం గుబ్బా చౌల్ట్రీలో కుటుంబ రాజ్యం సాగుతుందన్నారు. అలాగే జీవన్ కుమార్, అశ్విన్ కుమార్ లు ఇందుకోసం చెన్నైలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారని కూడా అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇది ఇలానే కొనసాగితే టీటీడీ సత్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొనే అవకాశం ఉందని చెప్పారు.