YV Subbareddy: శ్రీవాణి ట్రస్ట్ నిధుల్లో దుర్వినియోగం జరుగుతుందనంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టుకి మే నెల వరకు 861 కోట్లను భక్తులు విరాళాలుగా సమర్పించగా, 602 కోట్ల 60 లక్షలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినట్లు వెల్లడించారు. కరెంటు అకౌంట్‌లో 139 కోట్ల నిధులు ఉన్నాయని, 120.24 కోట్లని వివిధ కార్యక్రమాలకు గాను ఖర్చు చేయగా, శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్లు ద్వారా 36.50 కోట్ల వడ్డీ వచ్చిందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. 2019 సెప్టెంబర్ 23వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ కీ విరాళాలు సమర్పించిన భక్తులకీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని, శ్రీవాణి ట్రస్టుకీ రూ 500, 300లకు భక్తులకీ రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని వెల్లడించారు. అలాగే శ్రీవాణి ట్రస్టుకీ విరాళాలు ఇచ్చిన భక్తులకి రాజ్య మార్గం ద్వారా స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామన్నారు.


శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా పారదర్శకత పాటిస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ప్రారంభించిన తర్వాత దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి, మొదటి ఆరు నెలల్లోనే ప్రక్షాలన చేపట్టామన్నారు. ఇప్పటి  వరకు 70 మంది దళారులను అరెస్ట్ చేసి, 214 కేసులు నమోదు చేశామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క భక్తుడికి రసీదులు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 8 లక్షల మందికీపైగా భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామి వారిని దర్శించుకోగా ఎవరూ ఆరోపణలు చేయలేదన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళ్తే.. రసీదులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీటీడీపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడు దర్శనానికి వచ్చారో చెబితే పరిశీలించి తాము రసీదులు ఇస్తామన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మండిపడ్డారు.


నిన్నటికి నిన్న వివరణ ఇచ్చిన ఏవీ ధర్మారెడ్డి


 శ్రీవాణి ట్రస్టు విరాళాలు దుర్వినియోగం కాలేదని, హిందూ దేవాలయాల నిర్మించేందుకు నిధులను వినియోగిస్తున్నట్లు టిటిడి ఈవో ఏవీ.ధర్మారెడ్డి స్పష్టం చేశారు.. గురువారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి టిటిడి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్టు విరాళాలపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.  తిరుమలో విశ్వహిందూ పరిషత్ ట్రస్ట్ సభ్యులు శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన విషయాలను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు.. ఇప్పటి వరకు 6 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శించుకోగా.. 8 లక్షల 24 వేల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం అందించినట్లు తెలిపారు. రూ.860 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ విరాళం అందాయని, పది వేల విరాళం ఇచ్చి, రూ.500 టికెట్ కోసం చెల్లిస్తారని తెలిపారు. రూ.500 టికెట్ ఉంటే మూడు వందలకు రశీదు ఇస్తే భక్తులు ఎవ్వరు ఊరుకోరని, ఇలాంటి ఆరోపణలు చేస్తే భగవంతునిపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.