Tirumala Leopard Attacks Boy: తిరుపతి : రెండు రోజుల కిందట అలిపిరి నడక మార్గంలోని ఏడోవ మైలు వద్ద చిరుత పులి దాడిలో గాయపడిన ఐదేళ్ళ బాలుడు కౌశిక్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కొండయ్య, శిరీషా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి తిరుమలకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బాలుడు కౌశిక్ పై చిరుత పులి దాడి చేయడం తెలిసిందే. తాతయ్యతో కలిసి నడుచుకుంటూ ఆనందంగా ఆడుకుంటున్న బాలుడిని చిరుత దాడి చేసిందంటే అసలు నమ్మలేకపోయామని అతడి తండ్రి కొండయ్య అన్నారు. ఆ సమయంలో కాళ్లు, చేతలు ఆడలేని పరిస్ధితిలో ఎవరిని సహాయం అడగాలో అర్ధం‌ కాలేదని, తమ బిడ్డకు జరగరానిది ఏమైనా జరిగితే తాము అంతా ప్రాణాలతో ఉండే వారిమే కాదన్నారు.


చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన కౌశిక్ ను తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి సైతం చొరవ తీసుకుని, వైద్యం అందేలా చేశారు. మొదట్లో బాలుడి పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నప్పటికీ, క్రమక్రమంగా బాలుడు కౌశిక్ పూర్తి స్ధాయిలో కోలుకుంటున్నాడు. తమ బిడ్డ ఆరోగ్యం మెరుగు పడడంతో కౌశిక్ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. తాత అని మనవడు అరవకపోయి ఉంటే తప్పిపోయాడు అనుకునే వాళ్లమని, బాబును బతికించుకునే వాళ్లం కాదని ఆ ఘటనను తల్చుకుని కౌశిక్ వాళ్ల తాత భావోద్వేగానికి లోనయ్యారు.


చిరుత దాడి చేసే సమయంలో ఏం జరిగిందంటే..??
తిరుమల నడక మార్గం గుండా గోవిందుడిని స్మరించుకుంటూ తిరుమల కొండకు ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఆ శ్రీనివాసుడి భక్తులు. గత గురువారం రాత్రి సరిగ్గా తొమ్మిది గంటల ప్రాంతంలో ఏడోవ మైలు వద్ద స్నాక్స్ తీసుకుని తాతయ్యతో కలిసి కొండకు నడుస్తున్న చిన్నారి కౌశిక్ పై ఒక్కసారిగా చిరుతపులి దాడి చేసి ఆ చిన్నారిని నోట కరుచుకుని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళింది. ఆ సమయంలో బాలుడు తాతయ్య అంటూ కేకలు వేయడంతో, వెనుతిరిగి చూసే సరికే చిరుత బాలుడిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళింది. ఈ ఘటనతో ఒక్కసారిగా చిన్నారి కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకుని బాలుడి రక్షించాలంటూ నడక మార్గంలో వెళ్తున్న భక్తులను ప్రాదేయపడ్డారు.‌ 


భక్తులంతా గుమిగూడి రాళ్ళు విసురుతూ, శబ్ధాలయ చేస్తూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళే సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న తిరుమల వన్ టౌన్ ఎస్సై రమేష్ బాలుడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి అటవీ ప్రాంతంలో బాలుడి ఆచూకీ కోసం గాలించారు. అప్పటికే అటవీ ప్రాంతంలో దాదాపు మూడు వందల మీటర్ల వరకూ బాలుడిని తీసుకెళ్ళిన చిరుత.. భక్తులు, పోలీసులు పెద్దగా శబ్ధాలు చేస్తుండడంతో అక్కడే వదిలి పెట్టి పరార్ అయ్యింది. ఆ తరువాత స్పృహలోకి వచ్చిన చిన్నారి ప్రక్కనే ఉన్న రిపీటర్ వెలుతురు గమనించి ఆ దిశగా అడుగులు చేశాడు. 


అప్పటికే శబ్ధాలు గమనించిన రిపీటర్ వద్ద ఉన్న అటవీ శాఖ సిబ్బంది వెలుతురు వేస్తూ ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టగా ఏడుస్తూ బాలుడు కనిపించాడు.‌ బాలుడిని గమనించిన అటవీ శాఖ సిబ్బంది బాలుడిని సురక్షితంగా రక్షించి బాలుడి కోసం గాలిస్తున్న వారికి సమాచారం అందించారు. అప్పటికే గాయాల పాలైన బాలుడిని హుటాహుటిన 108 అంబులెన్స్ ద్వారా తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి మెరైన వైద్యం అందించారు. ఐతే గాయపడిన బాలుడితో పాటుగా టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీసి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గత రెండు రోజుల కంటే బాలుడు ఆరోగ్యం మెరుగు పడడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.


చిరుత కోసం బోన్లు వేసిన ఫారెస్ట్ అధికారులు..
ఐదేళ్ళ చిన్నారిపై చిరుత పులి దాడి చేసి గాయపరిచిన ఘటనతో టిటిడి అప్రమత్తమైంది.. నడక మార్గంలోని భక్తుల‌ రక్షణార్ధం చిరుత పులిని బంధించేందుకు చర్యలు చేపట్టింది.. చిరుత పులి బాలుడిని ఎత్తుకెళ్ళి ఘటనపై రీ కన్ స్ట్రక్షన్ చేసి చిరుత పులి అధికంగా సంచరించే జాడలను కనుగొన్నారు. ఆ ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా కెమరా ట్రాప్స్ ను ఏర్పాటు చేయడంతో పాటుగా రెండు పులి బోనులను ఏర్పాటు చేసింది.‌ అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేసిన ఏడు గంటల్లోనే చిరుత బోనుకు చిక్కింది. దీంతో చిరుత పులిని తిరుపతి‌ జూ పార్క్ కు తరలించి వైద్య పరిక్షలు నిర్వహించి, అక్కడి నుండి తలకోన అటవీ ప్రాంతంలొ చిరుతను అధికారులు వదిలి పెట్టారు.  Also Read: తిరుమలలో ఇంకా వీడని చిరుత భయం - తల్లిని బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం


ఆ వెంకన్న స్వామీ దయ వల్లే మా బిడ్డ బ్రతికాడు..!!
చిరుత పులి దాడిలో గాయపడిన బాలుడు కౌశిక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యలు వెల్లడించారు. చిరుత దాడిలో గాయపడిన కౌశిక్ దేవుని దయతోనే క్షేమంగా ఉన్నాడని, బాలుడికి చికిత్స అందించే విషయంలో టీటీడీ అధికారుల స్పందించిన తీరు అభినందనీయం అన్నారు. తాతయ్యతో కలిసి నడుచుకుంటూ ఆనందంగా ఆడుకుంటున్న బాలుడిని చిరుత దాడి చేసిందంటే అసలు నమ్మలేకపోయామని, ఎవరిని సహాయం అడగాలో అర్ధం‌ కాలేదన్నారు. తమ బిడ్డకు జరగరానిది ఏమైన జరిగితే తాము ప్రాణాలతో ఉండే వాళ్లం కాదని బాలుడి తండ్రి కొండయ్య అన్నారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial