తిరుమలలో చిరుతను పట్టుకున్న అటవీ శాఖాధికారులు మరో బాంబు పేల్చారు. తల్లి, పిల్ల చిరుతలు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు ప్రకటించారు. చిరుతను పట్టుకున్నారన్న ఆనందం కంటే తల్లి చిరుత ఏం చేస్తుందో అన్న భయం మొదలైంది. ఇన్నాళ్లూ కలిసి తిరిగిన రెండు ఇప్పుడు ఒంటరైన తల్లి చిరుత ఊరుకుంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. 


అయితే తిరుమలకు కాలినడకన వచ్చే  భక్తులు భయపడాల్సిన పని లేదని టీటీడీ అటవీ శాఖాధికారులు భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకు తల్లి చిరుత మనుషులపై దాడి చేసిన ఘటనలు జరగలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చిరుత కూనకు కూడా వేట కొత్త అని అంటున్నారు. 


తన బిడ్డ కనిపించకపోవడంతో తల్లి చిరుత వైల్డ్‌గా రియాక్ట్ అయితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటి ప్రమాదం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరిస్తున్నారు టీటీడీ అధికారులు. కాలినడక వచ్చే భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నామని వివరిస్తున్నారు. కొన్ని రోజుల పాటు అధికారులు చెప్పినట్టు ఒంటరిగా ఆ ప్రాంతాల్లో తిరగొద్దని సూచిస్తున్నారు. 


తల్లి చిరుతను పట్టుకోవడానికి కూడా టీటీడీ ‌అటవీశాఖాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆ చిరుత తిరిగే ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. ఆ ప్రాంతాల్లో బోనులు, కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏ క్షణమైన తల్లి చిరుతను కూడా బంధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే భక్తులు కంగారు పడాల్సిన పని లేదని అంటున్నారు. 


చాలా రోజుల నుంచి తిరుమలలో చిరుతల సంచారం కామన్‌ అయిపోయింది. ఇంత వరకు భక్తులపై అటాక్ చేయలేదని అటవీశాఖాధికారులు పట్టించుకోలేదు. అవి భక్తులపై రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారే తప్ప వాటిని బంధించే ఆలోచన చేయలేదు. అయితే గురువారం కర్నూలుకు చెందిన కౌశిక్ అనే బాలుడిని ఎత్తుకెళ్లిపోవడంతో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 


బాలుడిపై చిరుత దాడి చేసిన తర్వాత రోజే అవి సంచరించే ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. 150కిపైగా కెమెరాలు ఫిట్ చేశారు. నిరంతరం పర్యవేక్షిస్తూ శుక్రవారం రాత్రి పిల్ల చిరుతను బంధించారు. దాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెడుతున్నట్టు అధికారులు తెలిపారు.