Tirumala News: వరుస సెలవులు, పెరటాసి మాసం కావడంతో తిరుమల ఏడు కొండలు భక్తులతో కిటకిటలాడుతుంది. గత రెండు రోజులుగా అనూహ్య రీతిలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠం1, 2 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యాన వనంలోని షెడ్లు, క్యూలైన్లు సామాన్య భక్తులతో నిండిపోయాయి. ఎనిమిది కిలోమీటర్ల మేర భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనం దాదాపు ముప్పై ఐదు గంటల నుండి నలభై ఐదు గంటల వరకూ సమయం పడుతుంది. శిలాతోరణం వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ ఎటువంటి సౌకర్యం కల్పించలేదని, కనీసం పిల్లలకు పాలు, అన్న ప్రసాదం వితరణ చేయడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం ఉదయం నుంచి పెరిగిన భక్తుల తాకిడి..
శ్రీ వేంకటేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన పెరటాసి మాసం(తిరుమల శనివారాలు) కావడంతో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. పెరటాసి మాసంలో శ్రీనివాసుడి దర్శనం పొందితే చేసిన పాపాలు తొలగి, శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే పెరటాసి మాసంలో పెరిమాళ్ దర్శనార్ధం భక్తజనం సప్త గిరులకు క్యూ కడుతారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్ల తరువాత తిరుమలలో జరిగిన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలకు భారీ స్ధాయిలో భక్తులు విచ్చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలోనే పెరటాసి మాసం రావడంతో బ్రహ్మోత్సవాలో ప్రివిలైజ్ దర్శనాలను టీటీడీ పాలక మండలి రద్దు చేసి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్య ఇస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేసింది.
అయితే ఈనెల 4, 5 తేదీల్లో సాధారణంగా కొనసాగిన భక్తుల రద్దీ గురువారం ఉదయం 10 గంటల నుంచి అనూహ్యంగా పెరిగింది. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణ గిరిలోని షెడ్లు భక్తులతో నిండి పోయిన శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 35 గంటల నుంచి 40 గంటల సమయం పడుతుంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు..
భక్తుల రద్దీ దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు భక్తులకు అసౌఖర్యం కల్గకుండా ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తుల అనూహ్య రద్దీపై వివిధ విభాగాధిపతులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా క్యూలైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, తాగు నీరు, పాలు వంటి సౌఖర్యాలు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ ఏడు కొండలపై కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అవసరం అయ్యే ఏర్పాట్లపై అధికారులు నిమగ్నం అయ్యారు. భక్తుల సంఖ్య పెరగడంతో భక్తుల రద్దీ ప్రదేశాలైన అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిధి గృహాలు, వసతి భవనాలు, పీఏసీ-1, 2, 3, 4, 5 వద్ద పోలీసులు భధ్రత ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు. అయితే గంటకు 4500 మంది భక్తులకి మాత్రమే దర్శన భాగ్యం కల్పించే అవకాశం టీటీడీకి ఉండడంతో భక్తులు ఓపికగా స్వామి వారి దర్శనం పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.