Tirumala News: తిరుమలలో కూల్చేసిన అన్నమయ్య ఇంటినీ, మంటపాన్ని, పవిత్ర దేవతామూర్తులనీ తిరుమల కొండపై యథాతధంగా పునః ప్రతిష్ఠించాలంటూ... తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయ శంకర స్వామి చైతన్య రథయాత్ర చేపట్టారు. జై భారత్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఐదో తేదీన ఈ యాత్రను చేపట్టారు. మూడోరోజుకు చేరిన ఈ రథయాత్రను సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి ప్రారభించబోతున్నారు. ముందుగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం రధయాత్ర  సాగించబోతున్నారు. అన్నమయ్య ఇంటిని పునర్నిర్మించాలంటూ 11 లక్షల 50 వేల మంది భక్తులు సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన విన్నపాలన్నీ తిరుల కొండకు చేరబోతున్నాయి.


రథయాత్ర కొండకు చేరేలోపే అన్నమయ్య ఇంటి పనులు ప్రారంభించాలని విజయ శంకర స్వామి డిమాండ్ చేశారు. లేకుంటే లక్షలాది భక్తులతో భారీ ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. అన్నమయ్య ఇళ్లు, మంటపం, పవిత్ర దేవతామూర్తులను గాలికొదిలేసి భగవంతుని ఆగ్రహానికి గురి కావొద్దంటు హితవు పలికారు.


2003వ సంత్సరంలో తాళ్లపాక అన్నమాచార్య నివసించిన ఇంటిని టీటీడీ కూల్చివేసింది. 1940లో కట్టిన తాళ్లపాక అన్నమాచార్య మంటపాన్ని, విగ్రహాన్ని, హనుమంతుడి విగ్రహాన్ని 2007లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తొలగించింది. వాటిని పునర్నిర్మించాలని కోరుతూ.. విజయ శంకర స్వామి ఈ యాత్రను చేపట్టారు. 


"కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని పరిచయం చేసిన తాళ్లపాక అన్నమాచార్య ఇంటిని, మంటపాన్ని, హనుమంతుడి విగ్రహాన్ని కూల్చేయడం పాపం. తిరుమల తిరుపతి దేవస్థానం వీటిని కూల్చేలి చాలా పెద్ద ఘోరమైన పాపానికి ఒడిగట్టింది. వీటికి నిరసనగా రెండు లక్షల సంతకాలు సేకరించేందుకు అన్నమయ్య గృహ సాధన సమితి, జైభారత్ వాళ్లు.. రెండు నెలల పాటు కష్టపడి అన్ని దేవస్థానాల వద్దకు వెళ్లారు. హిందూ బంధువులందరూ కలిసి 11 లక్షల 50 వేల సంతకాలు సేకరించారు. మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకునేలోపు టీటీడీ అన్నమాచార్య ఇంటినీ, మంటపం నిర్మాణాన్ని ప్రారభించాలి. అలాగే విగ్రహాలను పునః ప్రతిష్టించాలి."- విజయ శంకర స్వామి


జై భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చైతన్య రథయాత్ర మూడో రోజు కూడా సజావుగా సాగుతోంది. అనుకున్నదాని కంటే కూడా ఎక్కువ మందే ఈ రథయాత్రకు మద్దతు ఇస్తున్నారు. రెండు లక్షల సంతకాలు చేయించాలనుకుని ప్రారంభించారు. కానీ ఇప్పటికే 11 లక్షల 50 వేల మంది సంతకాలు చేసి అన్నమయ్య మంటపాన్ని, విగ్రహాన్ని కాపాడాలని కోరుతున్నారు. 


"సేకరించిన సంతకాలన్నీ ఈవోకు ఇస్తాం. ఈవో స్పందిచకపోతే కొండ మీదకు వెళ్లి నిరసన చేపడతాం. తిరుల తిరుపతి దేవస్థానం మహా పాపానికి ఒడిగట్టింది. ఇది చాలా తప్పు. తిరుమల కొండపై అన్యాయం జరుగుతోంది. వెంకటేశ్వర స్వామికి కూడా అన్యాయం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామి వారి భక్తులంతా గళం విప్పాలి. త్వరగా ఇంటిని పునర్నిర్మించాలి. వెంకటేశ్వర స్వామి మా వెనకాల ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన పాపానికి క్షమాపణ చెప్పి ఇంటిని, మంటపాన్ని, విగ్రహాలను పునర్నిర్మించాలని కోరుతున్నాం." - విజయ శంకర స్వామి