Tirumala Temple Hundi: తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ ముఖద్వారం ద్వారం ఎదుట ఒక్కసారిగా హుండీ జారి కింద పడిపోయింది. దీంతో సీల్ వేసిన హుండీ నుంచి కానుకలన్నీ నేలపై పడిపోయాయి. ఎంతో భక్తితో కళ్లకు అద్దుకుని ఆ శ్రీనివాసుడికి సమర్పించిన కానుకలు నేలపాలు కావడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి హుండీని ఆలయం నుంచి పరకామణి మండపానికి తరలిస్తున్న సమయంలో మహాద్వారం దగ్గర హుండీ కింద పడిపోయింది. ఆ సమయంలో హుండీ నుంచి కానుకలన్నీ కింద పడిపోయియాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది హుండీని సరిచేసి కానుకలను జాగ్రత్తగా తిరిగి ట్రాలీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పరకామణి మండపానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కింద పడిపోయిన కానుకలను సిబ్బంది సేకరించి అధికారులకు అప్పగించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానుకల హుండీ నేలపై పడడం అపచారం అంటూ లెంపలు వేసుకుంటున్నారు.
తరచుగా వెలుగులోకి టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం
హైదరాబాద్‌కు చెందిన కామిశెట్టి వేణు శ్రీవారి దర్శనం కోసం అభిషేక్ అనే ఓ వ్యక్తిని ఆశ్రయించారు. అయితే అతను నాలుగు వీఐపీ టికెట్లు ఇప్పిస్తామని చెప్పి వేణు వద్ద నుంచి రూ. 11 వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి శ్రీను ఫోన్ నెంబర ఇచ్చాడు. అతడిని సంప్రదిస్తే మంచిదని చెప్పాడు. భక్తుడు ఆయనను సంప్రదించగా... అతడు ఎం. అశోక్ నాయక్ అనే మరో దళారి నంబర్ ఇచ్చి అతడిని సంప్రదించాలని కోరాడు. భక్తుడు అతని వద్దకు వెళ్లగా నాలుగు ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లను అందజేశాడు. ఏసీ కూడలి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్సు మీదుగా వెళ్తే.. అక్కడ టికెట్ స్కానింగ్ చేసే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కు చెందిన శివ నారాయణ ఉంటాడని.. అతను అన్నీ చూసుకుంటాడన్నారు. శివనారాయణ టికెట్లను స్కాన్ చేసినట్లు నటించి దర్శనానికి పంపించేశాడు. అయితే బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని చెప్పి ప్రత్యే దర్శనానికి పంపిస్తుండడంతో మోసపోయినట్లు గుర్తించిన భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు టికెట్లను పరిశీలించి అవి ఎస్ఆడీ నకిలీ టీకెట్లుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే తిరుమలలో శునకం హల్ చల్ - విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల కన్నెర్ర
తిరుమలలో శునకం హల్ చల్ చేసింది. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకి వచ్చిన కర్ణాటక భక్తులతోపాటు వాహనంలో వారి పెంపుడు కుక్కని తిరుమలకి తీసుకొని రావడంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్ట బయలు అయింది. తిరుమలలో వన్య మృగాల సంచారం నేపథ్యంలో శునకాలని కొండ పైకి టీటీడీ నిషేధించింది. స్థానికులు నివసించే బాలాజీనగర్ లో కూడా శునకాలని పెంచడాన్ని కూడా టీటీడీ నిషేధించింది. అయితే కర్ణాటకకి చెందిన భక్తులు వారి టెంపో వాహనంలో కుక్కని తీసుకొచ్చినా.. భద్రతా సిబ్బంది పట్టించుకోక పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. భక్తులు కుక్కని వారి వాహనంలోనే పెట్టుకొని కొండపై చక్కర్లు కొడుతుండగా తీసిన వీడియోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందిపై భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చిరుత సంచారం పెరిగిన నేపథ్యంలో శునకం కోసం చిరుత జనవాసాల్లోకి వస్తే పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అలిపిరి తనిఖీ సమయంలో.. టిటిడి సిబ్బంది గుర్తించి ముందస్తుగానే అనుమతిని నిరాకరించాలని భక్తులు కోరుతున్నారు.