- తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు..
- టోకెన్లు పొంది శ్రీవారి దర్శనానికి రండి..
- జనవరి 1 నుండి పిఎసి-4లో అన్నప్రసాద వితరణ..
- ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి


నూతన ఆంగ్ల సంవత్సరాది జనవరి 1వ తేదీన, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడి అదనపు ఈవో(ఎఫ్ఏసి) వీరబ్రహ్మంతో కలిసి ఛైర్మన్ బుధవారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, సర్వదర్శనం క్యూలైన్లు, పిఎసి-4 తదితర ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. 
టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై పలువురు భక్తులతో ఛైర్మన్ ముచ్చటించగా వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ విస్తృతంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తులు తిరుపతిలో టైంస్లాట్ టోకెన్లు పొంది వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా త్వరితగతిన దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. 
విఐపిల సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదు
సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల కోసం విఐపిల సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని తెలిపారు. స్వయంగా వచ్చే విఐపిలకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు. కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్ తో పాటు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రధాన కల్యాణ కళ్యాణ కట్ట ఎదురుగా గల పిఎసి-4లో అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తామని తెలియజేశారు. 


జనవరి 1 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు జారీ 
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుమలలో టీటీడీ అధికారులతో కలిసి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.  అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక ఉన్న 2, 3 సత్రాలు, ఆర్‌టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పీ హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి 1న సర్వదర్శనం టోకెన్ల జారీ  ప్రారంభిస్తామన్నారు.