Gubba Choultry Tirumala Online Room Booking : 
తిరుమల : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కొందరు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఓవైపు స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనాల పేరుతో కొందరు భక్తులను బురిడీ కొట్టించి వేలకు వేల రూపాయలు వసూలు చేస్తుంటారు దళారీలు. ఈ క్రమంలో గుబ్బా చౌల్ట్రీలో కుటుంబ వివాదం నెలకొంది. తిరుమలలో రూ.300కు ఇవ్వాల్సిన రూమ్ లను ఏకంగా రూ.2000 కు ఇస్తున్నారని ఆ ఇంటి వ్యక్తులే ఆరోపించడంతో హాట్ టాపిక్ గా మారింది.


అసలేం జరిగిందంటే..
ఆర్ ఆర్ నాథన్ ఆధ్వర్యంలో గుబ్బా చౌల్ట్రీ ఏర్పాటు అయింది. గుబ్బా చౌల్ట్రీ ఫామిలీ ప్రాపర్టీ కాదు... దాతల సహకారంతో కట్టిందని (Gubba Choultry Kalyana Mandapam is located in Tirumala) ఆర్ ఆర్ నాథన్ చిన్న కుమారుడు అరుణ్ కుమార్ తెలిపాడు. కానీ ప్రస్తుతం గుబ్బా చౌల్ట్రీ కరెప్షన్ కు అడ్డాగా మారిందని అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్య వైశ్యుల కోసం తిరుమలలో గుబ్బా, చిత్తూరు చారిటీ సత్రాలు గతంలోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వివాదం ఏంటంటే.. గుబ్బా చౌల్ట్రీని ఆర్ఆర్ నాథన్ పెద్ద కుమారులు తమ ఫ్యామిలీ ప్రాపర్టీగా వినియోగిస్తున్నారని వారి తమ్ముడు ఆరోపించారు. 


గుబ్బా చౌల్ట్రీ దాతల సహకారంతో ఏర్పాటు చేసింది కాగా, తన అన్నలైన జీవన్ కుమార్, అశ్విన్ కుమార్ లు దాన్ని కుటుంబ ఆస్తిగా వినియోగిస్తున్నారని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. నాన్న ఆర్ఆర్ నాథన్ బతికున్న సమయంలో రూములను రూ. 300 లకే ఇచ్చేవాళ్ళం అని.. నేడు నాన్ ఏసీ రూములు రూ. 1500, ఏసీ రూము రూ. 2000 వేలుగా మార్చేశారని తెలిపారు. కానీ ఇది ధర్మసత్రం అని, ఇందులో ధర్మ కార్యక్రమాలు మాత్రానే సాగాలని.. అక్రమాలకు తావు ఇవ్వకుండా ఉండాలన్నారు. ఎవరి కోసం ఇది ఏర్పాటు చేశారో, ఇప్పుడు ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో నగదు తీసుకుని నాన్ ఆర్యవైశ్యులకు గదులు కేటాయించి ధర్మసత్రంలో దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఆర్య వైశ్యుల నుంచి గుబ్బ సత్రాన్ని దూరం చేస్తున్నారు. ఇతర కులాల వారికీ అధిక రేట్లకు రూములను విక్రయిస్తున్నారు. గతంలో 70 రూములు ఆర్య వైశ్యులకు, దాతలకు ఇచ్చేవారు. ఇప్పుడు 20 రూములు కూడా ఇవ్వడం లేదన్నారు అరుణ్ కుమార్. ఇతర కులాల వారు సత్రానికి వస్తే ఫేక్ డొనేషన్ స్లిప్ ఇస్తున్నారని.. దాతకు రూ. 500 కు రూము కేటాయించాలని 20 రూములు ఇస్తుంటే... మిగిలిన రూములు రూ 2 వేలకు విక్రయిస్తున్నారని ఆర్ఆర్ నాథన్ చిన్న కుమారుడు ఆరోపించారు.  


ప్రస్తుతం గుబ్బా చౌల్ట్రీలో కుటుంబ రాజ్యం సాగుతుంది. జీవన్ కుమార్, అశ్విన్ కుమార్ లు ఇందుకోసం ప్రత్యేక కార్యాలయాన్ని చెన్నైలో ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇలానే కొనసాగితే టీటీడీ సత్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొనే అవకాశం ఉందని అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధర్మసత్రంగా వినియోగిస్తూ తిరుమలకు వచ్చే ఆర్యవైశ్య భక్తులకు సేవ చేయాలని, అధిక ధరలకు రూములు కేటాయించి దోపిడీ చేయవద్దని సూచించారు.