Janahita Ambulance Watch Video: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జూన్ 14న వారాహి యాత్ర చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యాత్ర కోసం అంబులెన్స్ ను సిద్ధం చేసింది జనసేన. పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న వారాహి యాత్రను జనహిత పేరుతో అంబులెన్సు వాహనం అనుసరించనుంది. అత్యవసర సమయాల్లో వైద్యం సదుపాయం అందించే విధంగా అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 8 గంటల లైఫ్ సపోర్ట్ తో వెంటిలేటర్, మోనిటర్ తోపాటు ఆక్సిజన్, ఎమర్జెన్సీ కిట్లూ జనహితలో ఉన్నాయి. అత్యవసర మందులు, ప్రాథమిక వైద్యానికి తగిన పరికరాలు కూడా అంబులెన్స్ లో ఉంచారు.
జనహిత (వారాహి అంబులెన్స్)ను డాక్టర్ లక్ష్మణరావు చిట్టెం పర్యవేక్షించనున్నారు. వారాహి వెనుకనే వచ్చే ఈ జనహిత అంబులెన్స్ లో డ్యూటీ డాక్టర్, నర్సు, డ్రైవర్ ఉంటారు. జనహిత అంబులెన్సును మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అంబులెన్స్ లోని అత్యాధునిక వైద్య పరికరాలను స్వయంగా పరిశీలించారు. అంబులెన్సు పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మణరావు చిట్టెంతో మాట్లాడి ఇతర వివరాలు తెలుసుకుని, అభినందించారు. ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ.. "వారాహి యాత్రలో అంబులెన్సు అవసరమే రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం" అన్నారు.
బుధవారం నంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టే వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో టూర్ షెడ్యూల్‌ను జనసేన రిలీజ్ చేసింది. ఒక రోజు ముందుగానే అన్నవరం చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అన్నవరం కొండపైనే రాత్రి బస చేస్తారు. బుధవారం ఉదయం రత్నగిరి సత్యదేవుని దర్శనం చేసుకున్నాక అనంతరం వారాహి వాహనానికి పూజలు చేయించి అక్కడి నుంచి యాత్రకు బయల్దేరనున్నారు. అయితే అన్నవరం పుణ్యక్షేత్రం వద్ద ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు, జెండాలు పట్టుకురావడం, ప్రసంగాలు చేయడం నిషిద్ధమని అటువంటివి జరక్కుండా చూసుకోవాలని జనసేన ముఖ్యనాయకత్వానికి అన్నవరం దేవస్థానం ఈవో ఆజాద్ ఇప్పటికే ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
వారాహి యాత్ర బహిరంగ సభల షెడ్యూల్
14 జూన్ 2023 – కత్తిపూడి సభ
16 జూన్ 2023 – పిఠాపురం వారాహి యాత్ర సభ
18 జూన్ 2023 – కాకినాడల వారాహి యాత్ర సభ
20 జూన్ 2023 – ముమ్మిడివరంవారాహి యాత్ర సభ
21 జూన్ 2023 – అమలాపురం వారాహి యాత్ర సభ
22 జూన్ 2023 - పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర మలికిపురంలో సభ
23 జూన్ 2023 – నరసాపురంలో వారాహి యాత్ర సభ