కాకినాడ జిల్లా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో బుధవారం నంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేపట్టే వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో టూర్‌ షెడ్యూల్‌ను జనసేన రిలీజ్ చేసింది. 




జనసేన కార్యాలయంలో యాగం చేస్తున్న పవన్ కల్యాణ్‌ పూర్ణాహుతితో యాగం పూర్తి చేయనున్నారు. అనంతరం అన్నవరం బయల్దేరి వెళ్లనున్నారు. పవన్ కంటే ముందుగానే వారాహి వాహనం అన్నవరం చేరుకోనుంది. అనుమతి విషయంలో రెండు రోజులుగా చాలా చర్చ నడిచింది. ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సంయమనంతో న్యాయపోరాటం చేస్తామని జనసేన ప్రకటించింది. ఉమ్మడి ఉభయ గోదావరి  జిల్లా నేతలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటు అనుమతి విషయంలో ఫాలో అప్ చేశారు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమవుతూ వచ్చారు. చివరకు అనుమతి రావడంతో అంతా యాత్ర విజయం చేసే అంశంపై దృష్టి పెట్టారు. 


ఒక రోజు ముందుగానే అన్నవరం చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అన్నవరం కొండపైనే రాత్రి  బస చేస్తారు. బుధవారం ఉదయం రత్నగిరి సత్యదేవుని దర్శనం చేసుకున్నాక అనంతరం వారాహి వాహనానికి పూజలు చేయించి అక్కడి  నుంచి యాత్రకు బయల్దేరనున్నారు. అయితే అన్నవరం పుణ్యక్షేత్రం వద్ద ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు, జెండాలు పట్టుకురావడం, ప్రసంగాలు చేయడం నిషిద్ధమని అటువంటివి జరక్కుండా చూసుకోవాలని జనసేన ముఖ్యనాయకత్వానికి అన్నవరం దేవస్థానం ఈవో ఆజాద్‌ ఇప్పటికే ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.



అప్రమత్తమైన ఆలయ అధికారులు..

 

జనసేన అధినేత పవన్‌ సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసి యాత్రను ప్రారంభించనున్న వేళ ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. జనసేనాని కోసం పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు రత్నగిరిపైకి తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండడం, సెలవులతో  భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కొండపైకి ఎటువంటి జెండాలుతో రాకుండా, పరిమితికి మించిపైకి రాకుండా కొండ క్రిందనే దేవస్థానం ముఖ ద్వారం వద్దనే అడ్డుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

 

పల్లవి గెస్ట్‌ హౌల్‌లో పవన్‌ కళ్యాణ్‌..

 

ఈ సాయంత్రానికే అన్నవరం దేవస్థానానికి చేరుకోనున్న జనసేన అధినేత పవన్‌  బస కోసం పల్లవి గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాట్లు చేశారు. ఉదయమే సత్యదేవుని దర్శించుకున్న అనంతరం వారాహి వాహనానికి సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అన్నవరం నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి వరకు రోడ్‌షో, అనంతరం కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటారు.


వారాహి యాత్ర బహిరంగ సభల షెడ్యూల్


14 జూన్ 2023 – కత్తిపూడి సభ 


16 జూన్ 2023 – పిఠాపురం వారాహి యాత్ర సభ 


18 జూన్ 2023 – కాకినాడల వారాహి యాత్ర సభ 


20 జూన్ 2023 – ముమ్మిడివరంవారాహి యాత్ర సభ 


21 జూన్ 2023 – అమలాపురం వారాహి యాత్ర సభ 


22 జూన్ 2023 - పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర మలికిపురంలో సభ 


23 జూన్ 2023 – నరసాపురంలో వారాహి యాత్ర సభ



 

కోనసీమ జిల్లాలో తొలగని అడ్డంకులు..? 

 

కాకినాడ జిల్లాతోపాటు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కూడా జనసేన అధినేత వపన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో రెండు జిల్లా ఎస్పీలకు అనుమతులు కోరుతూ ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ముఖ్యనాయకులు ఇరు జిల్లా ఎస్పీలను కలిసి అనుమతులు కోరుతూ పత్రాలను, రూట్ మ్యాప్ లు సమర్పించారు. అయితే ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కోనసీమ జిల్లాలో వారాహి యాత్రకు సంబంధించి అనుమతులు గురించి ఇంకా స్పష్టత లభించలేదు. పవన్‌ ప్రోగ్రాం మినిట్‌ టూ మినిట్‌ వివరాలు ఇవ్వలేదని అందుకే అనుమతులు ఇంకా లభించలేదని పోలీసు వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పోలీసులు వారాహి యాత్రకు మోకాలడ్డితే కోర్టును ఆశ్రయించాలని జనసేన పార్టీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.