BR Naidu is chairman of TTD | అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలక మండలి ఏర్పాటైంది. టీటీడీ నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పాటు అవుతోంది. ఈ మేరకు టీటీడీ బుధవారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ బోర్డులో ఎమ్మెల్యేలు, కేంద్ర మాజీ మంత్రి, వ్యాపారవేత్తలు సహా పలు రంగాల వారు చోటు దక్కించుకున్నారు.
పవన్ కళ్యాణ్ సన్నిహితుడికి టీటీడీ బోర్డులో అవకాశం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన స్నేహితుడికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇప్పించుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పునర్నిణానికి ఆనంద్ సాయి చీఫ్ డిజైనర్ గా పనిచేశారు. మాజీ సీజేఐ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపికయ్యారు. 2014-15 కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్ ఎల్ దత్తు సేవలు అందించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండోసారి టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రశాంతి రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా కూటమి ప్రభుత్వం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మరోసారి టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం ఇచ్చింది.
టీటీడీ బోర్డు సభ్యులు వీరే..
- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
- జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
- పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
- ఎం ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
- సాంబశివరావు (జాస్తి శివ)
- నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
- కృష్ణమూర్తి
- శ్రీ సదాశివరావు నన్నపనేని
- కోటేశ్వరరావు
- మల్లెల రాజశేఖర్ గౌడ్
- జంగా కృష్ణమూర్తి
- దర్శన్ ఆర్.ఎన్
- శాంతారామ్
- పి రామ్మూర్తి
- జస్టిస్ హెచ్‌ఎల్ దత్
- జానకీదేవి తమ్మిశెట్టి
- అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
- బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)
- సుచిత్ర ఎల్లా (తెలంగాణ)
- బురగపు ఆనందసాయి (తెలంగాణ)
- నరేశ్ కుమార్
- డాక్టర్ అదిత్ దేశాయ్
- సౌరబ్ హెచ్ బోరా
లడ్డూ వివాదం అనంతరం టీటీడీకి కొత్త ఛైర్మన్, పాలక మండలి
తిరుమల లడ్డూ వివాదం అనంతరం ఏపీ ప్రభుత్వం టీటీడీ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. కల్తీ లేకుండా చూడాలని, స్వామివారికి చేసే అపరాదం అందరి జీవితాలను ప్రభావం చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీక్ష విరమించారు పవన్. ఆపై తిరుపతిలో వారాహి విజయోత్సవ సభ నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటూ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ఈ క్రమంలో టీటీడీకి కొత్త ఛైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించడంతో పాటు పాలకమండలి సభ్యుల పేర్లను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.