Tirumala Navaratri Brahmotsavam 2023: బ్రహ్మాండ నాయకుడికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలు అయిపోగా దసరా పండుగకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ఏడాది ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కానీ చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కన్యామాసం(భాద్రపదం)లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, దసర నవరాత్రుల్లో(ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే తిరుమలలో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. బహ్మోత్సవాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
వార్షిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తేడా ఏంటి?
చంద్రమానంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఆ సమయంలో భాద్రపదంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలు అంటారు. దాని తరువాత దసరా సందర్భంగా మరో సారి ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు. పురాణాల ప్రకారం శ్రీవారు వేంకటాద్రిపై వెలిశారు. తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారు.
దీంతో స్వామివారు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాల నిర్వహించారట. అందువల్లే అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది ఆనాటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది అధికమాసం కారణంగా భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు చిన్నపాటి తేడా ఉంటుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉంటుంది. అయితే దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం, ధ్వజావరోహణం తంతు ఉండదు.
అక్టోబర్ 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాని టీటీడీ పేర్కొంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 15 ఆదివారం రాత్రి పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అప్పటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 16వ తేదీ సోమవారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరిస్తారు. 17 తేదీ మంగళవారం ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలు జరుగుతాయి. 18వ తేదీ బుధవారం ఉదయం 8 నుంచి 10 వరకు కల్ప వృక్ష వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు సర్వ భూపాల వాహనంపై స్వామి వారు భక్తులను కరుణిస్తారు.
అక్టోబర్ 19వ తేదీ గురువారం ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది. అక్టోబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం 8 నుంచి 10 వరకు హనుమద్ వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజ వాహనంపై శ్రీవారు విహరిస్తారు. 21 శనివారం రోజున ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. 22వ తేదీ ఆదివారం ఉదయం స్వర్ణ రథోత్సవం, రాత్రి అశ్వ వాహనంపై స్వామివారు విహరిస్తారు. 23వ తేదీ సోమవారం తొమ్మిదో రోజు స్వామివారికి చక్ర స్నానం నిర్వహిస్తారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు సేవలు బంద్
నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 15 నుంచి 23 వరకు పలు సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు తెలిపింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబరు 14న సహస్ర దీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.