Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు దీర్ఘ కాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఫోన్ లైన్ లో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో 23.38 లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రూ.109.99 కోట్లు హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పించారని చెప్పారు. అలాగే కోటి 6 లక్షల లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు. 56.30 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు వెల్లడించారు. మొత్తం 11 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు.
సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనం, సుప్రభాత సేవ వీక్షణ రద్దు
వేసవి సెలవుల్లో తిరుమలకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని తెలిపారు. ఇందుకోసం జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్లు చెప్పారు. సుప్రభాత సేవ వీక్షణ కోటా రద్దు చేసినట్లు వెల్లడించారు. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతుందని చెప్పారు. టీటీడీ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు, ఇతర విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు చక్కటి సేవలు అందిస్తున్నారన్నారు. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుందని, అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని ఈవో విజ్ఞప్తి చేసారు..
సుందర తిరుమల-శుద్ధ తిరుమల
తిరుమల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. టీటీడీ చరిత్రలో తొలిసారి టీటీడీ లోని అన్ని విభాగాల ఆధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా నెల రోజుల పాటు సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. నెల రోజుల్లో 15,441 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 13,351 మంది కార్పొరేషన్ సిబ్బంది, 6 వేల మందికి పైగా శ్రీవారి సేవకులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్, పోలీస్, న్యాయశాఖ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాలు, రెండు ఘాట్ రోడ్లు, రెండు నడక దార్లలో పారిశుద్ధ్య విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలియజేశారు. మే 13వ తేదీన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణ సైతం తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.
ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళిక
తిరుమల ఘాట్‌రోడ్లలో ఇటీవల డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండీషన్ బాగా లేనందు వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయని.. ప్రమాదాల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. ట్యాక్సీ డ్రైవర్లు, వాహనదార్లు డ్రైవింగ్ చేసే సమయంలో టీటీడీ నిర్ణయించిన వేగం మేరకే నిదానంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడకుండా, మలుపుల వద్ద పరిమిత వేగంతో , ఓవర్ టేక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
జూన్ 7న ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి టీటీడీకి కేటాయించారని తెలిపారు. ఈ భూమిలో దాత, రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా రూ.100 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 7న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు భక్తులు పాల్గొంటారని తెలిపారు.
జమ్మూలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ
సనాతన హైందవ ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల సీతంపేట, రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినట్లు తెలిపారు. జమ్మూలోని మజీన్ గ్రామంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించినట్లు వెల్లడించారు.