Tirumala news: తిరుమల: తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. ఎల్లప్పుడూ పచ్చతోరణం లాగా తిరుమలలో నిత్యం ఏదో ఒక ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి తిరుమలలో చాలా మందికి తెలియని బాగ్ సవారీ ఉత్సవం గురించి మీరు ఈ స్టోరీ చదివి తెలుసుకోండి...


తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే అనేక ఉత్సవాల్లో ఈ బాాగ్ సవారీ ఉత్సవం కూడా ఒక్కటి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా అంకురార్పణ తో ప్రారంభమై ప్రతి రోజు ఉదయం, రాత్రి వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించే స్వామివారికి చక్రస్నానం, ధ్వజావరోహణం తో పరిసమాప్తం అవుతాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు బాగ్ సవారీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది.


బాగ్ సవారీ చరిత్ర


పురాణాల ప్రకారం స్వామి వారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి దేవేరి సమేతంగా స్వామివారు తిరుమలలోని అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషాన్ని గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రజు ఈ బాగ్ స‌వారి ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. 


బాగ్ సవారీ ఉత్సవం... 
ఆనాటి గుర్తుగా నేటికి స్వామి వారు బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు అంటే ఈ సంవత్సరం 13.10.2024 (ఆదివారం) సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకుంటారు. అనంతరం అక్కడి నుంచి  ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో జీయంగార్లు, టీటీడీ అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొంటారు. 


Also Read: Diwali 2024: దీపావళికి ముందు ఈ వస్తువులు ఇంటికి తీసుకొస్తే ఎంత భక్తితో పూజ చేసినా ప్రయోజనం ఉండదు