అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమల. ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుని దివ్య మంగళ స్వరూపాన్ని క్షణకాలం దర్శించుకుంటే చాలుని భక్తులు పరితపించిపోతారు. ఇలా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు నగదును కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తుంటారు. స్వదేశీ కరెన్సీ నోట్ల నుంచి విదేశీ డాలర్ల వరకు శ్రీవారి హుండీలో కానుకల రూపంలో సమర్పించి మొక్కులు చెల్లిచుకుంటారు.


హుండీలో వచ్చిన కానుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరకమణిలో హుండీ ద్వారా స్వామి వారికి వచ్చిన ఆదాయాన్ని లెక్కిస్తుంటారు. ఈ పరకామణిని నోట్ల పరకామణిని, నాణేల పరకామణినిగా ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. స్వామి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే కానుకలను హైసెక్యురిటి మధ్య లెక్కింపు జరుగుతుంది. 


ఇలాంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మాత్రం తన చేతివాటం చూపించాడు. పరకామణిని మండపంలో విదేశీ డాలర్లలను చోరీ చేసిన ఘటన విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. 


తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పరకామణి మండపంలో చిల్లర నాణేలు, కరెన్సీ నోట్లను లెక్కిస్తుంటారు. కరెన్సీ లెక్కింపునకు శాశ్వత, రిటైర్డ్ ఉద్యోగులను నియమిస్తుంటారు. ఇదే ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది. పరకామణి మండపంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం విధులు నిర్వహిస్తుంటారు. ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిలో ఎలాంటి దుర్బుద్ధి పుట్టిందేమోగాని శ్రీవారికీ భక్తులు సమర్పించే కానుకలను లెక్కింపు చేసే పరకామణి మండపంలో కరెన్సీ నోట్లు చోరికి గురయ్యాయి. 


పరకామణి మండపంలో పని చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ చోరీకి పాల్పడినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు సాక్ష్యాలతో సహా నిర్ధారణకు వచ్చారు.. చోరికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా విజిలెన్స్ అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు బయట పడ్డాయి. గత కొద్దీ నెలలుగా ఈ వ్యక్తి కరెన్సీ నోట్లను చోరీ చేస్తున్నట్లు, అందులో స్వదేశీతోపాటు విదేశీ కరెన్సీ చోరీ చేసినట్లు సమాచారం. 


ఈ ఘటనతో ఉల్లికిపడ్డ విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని గొప్యంగా ఉంచి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. పరకామణి మండపంలో చోరీ జరిగినట్లు నిన్న రాత్రి విజిలెన్స్ అధికారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. సీసీ కెమెరాలు, కొన్ని రోజులుగా డ్యూటీకి వస్తున్న వారి వివరాలు, రిజిస్టర్‌లో ఎవరెవరు సంతకాలు చేశారనే వివరాలతో కేసును సాల్వ్ చేయడానికి చూస్తున్నారు పోలీసులు