Chandragiri Girls Missing : నలుగురు విద్యార్థినులు 8 అడుగుల ఎత్తుగల గాజు పెంకులు గోడను దూకి పరారయ్యారని సంప్రదాయ పాఠశాల ఇన్చార్జ్ లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో డీఎస్పీ నరసప్ప విచారణ చేపట్టగా, అసలు అర్ధరాత్రి విద్యార్ధినులు గోడ ఎందుకు దూకారు, ఎక్కడి వెళ్లారు అనే విషయంపై పోలీసు దర్యాప్తు సాగిస్తున్నారు. పారిపోయిన విద్యార్ధినుల కోసం నాలుగు జిల్లాలో పోలీసు బృందాలు గాలిస్తున్నారు.‌ 


అసలేం జరిగింది? 


ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని తొండవాడలో గల సంప్రదాయ పాఠశాలలో దాదాపు 350 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాలలో 150 సీసీ కెమెరాలు, 10 మందికి పైగా సెక్యూరిటీ గల సంప్రదాయ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినుల మిస్సింగ్ పై డీఎస్పీ నరసప్ప విచారణ చేపట్టారు. కంచి కామకోటి పీఠాధిపతి ఆధ్వర్యంలో మహిళా వేద విద్య అభ్యసించేందుకు ఏర్పాటు చేసిన ఈ సంప్రదాయ పాఠశాలలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్ధినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో కొందరు విద్యార్థినులు శ్రీనివాస డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కాలేజీ సమీపంలోని సంప్రదాయ పాఠశాలలో వసతి పొందుతున్నారు‌. అర్థరాత్రి గోడ దూకి పరారైన విద్యార్థినులు విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాలకు చెందిన విద్యార్ధినులుగా పోలీసులు గుర్తించారు. సంప్రదాయ పాఠశాల ఇన్చార్జ్ లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. రాత్రి నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా విద్యార్థినులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులు ఫ్రెండ్స్ ని కూడా విచారించారు పోలీసులు. పాఠశాల నుండి పారిపోయిన నలుగురు విద్యార్థినుల్లో ఇద్దరు విద్యార్ధినిలు మైనర్లు ఉన్నారు. విద్యార్థునుల తల్లితండ్రులు సమాచారం అందించిన పోలీసులు పలు కోణాల్లో కేసుపై దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే కడప జిల్లా, రాజులపాళెంకు చెందిన ఓ విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకోగా, మిగిలిన జిల్లాల నుంచి కూడా విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు బయలుదేరారు. పాఠశాల నుంచి అర్ధరాత్రి గోడ దూకి పరారయిన విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. 


మిస్సింగ్ పై పోలీసులు విచారణ 


నిన్న అర్ధరాత్రి సంప్రదాయ పాఠశాల ప్రహరి గోడ దూకి నలుగురు విద్యార్ధినులు పరారయిన విషయం తెలుసుకున్న పోలీసులు తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర ప్రాంతాలు అర్ధరాత్రి నుండి గాలిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా నాలుగు జిల్లాల్లో నాలుగు ప్రత్యేక బృందాలు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మరో ప్రత్యేక బృందం విద్యార్థినుల కోసం గాలిస్తున్నట్లు తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప వెల్లడించారు. మగ పిల్లలకు వేద పాఠశాల ఎలా ఉంటుందో అలాగే ఆడ పిల్లల కోసం సంప్రదాయ రెసిడెన్షియల్ పాఠశాలను కంచి కామకోటి పీఠాధిపతి ఆధ్వర్యంలో నడుస్తున్నదని ఇన్చార్జ్ లక్ష్మి అన్నారు. అర్ధరాత్రి నలుగురు అమ్మాయిలు గోడ దూకి పారిపోయారని సమాచారం అందడంతో వెంటనే పోలీసులకు, పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించామని పాఠశాల ఇంఛార్జ్ లక్ష్మి చెప్పారు.