వాట్సాప్ ఇటీవలే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాట్సాప్‌లో మెసేజ్ రియాక్షన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు ఇప్పుడు కంపానియన్ మోడ్ అనే కొత్త ఫీచర్ కూడా రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే... ఒకే వాట్సాప్ ఖాతాను రెండు ఫోన్లలో ఉపయోగించవచ్చు.


వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo వెబ్‌సైట్‌లో ఈ వివరాలు తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్‌ను ఒకేసారి రెండు ఫోన్లలో ఉపయోగించే అవకాశం లేదు. వాట్సాప్ వెబ్ ద్వారా పీసీలో ఉపయోగించే ఫీచర్ ఉంది. కానీ అది రెండు ఫోన్లకు వర్తించదు. త్వరలో వచ్చే ఈ ఫీచర్‌తో అది కూడా జరగనుంది.


త్వరలో రానున్న ఈ కంపానియన్ ఫీచర్ ద్వారా ఒక వాట్సాప్ ఖాతాను మరో ఫోన్‌కు కూడా లింక్ చేయవచ్చు. మీ ఫోన్‌లో ఉన్న వాట్సాప్ ఖాతాను మరో ఫోన్‌లో లాగిన్ చేయాలంటే... సెకండరీ ఫోన్‌లో ఉన్న వాట్సాప్ ఖాతాను మొదట లాగౌట్ చేయాల్సి ఉంటుంది.


ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. కాబట్టి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో పాటు ట్యాబ్లెట్లకు కూడా దీన్ని లింక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా WABetaInfo షేర్ చేసింది. ఐవోఎస్‌కు కూడా ఈ ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తుంది.


వాట్సాప్ ఇటీవలే తన వినియోగదారులకు ఎమోజీ రియాక్షన్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వీటి ద్వారా వినియోగదారులు తమ ఎమోషన్లను ఎమోజీల రూపంలో తెలపవచ్చు. మొదట కేవలం ఆరు ఎమోజీ రియాక్షన్లు మాత్రమే అందుబాటులో రానున్నాయి. లైక్, లవ్, సర్‌ప్రైజ్, శాడ్, థ్యాంక్స్, లాఫ్ ఎమోజీలతో వినియోగదారులు రియాక్ట్ అవ్వవచ్చు.